జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన తాజా నివేదికను భూపరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేసినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధ వారం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలో తాజా నివేదికకు ప్రాధాన్యమేర్పడింది. మంగళవారం సీఎస్‌ను కలిసిన సీసీఎల్‌ఏ నివేదికలోని అంశాలపై సుమారు మూడుగంటల పాటు చర్చించినట్లు సమాచారం.



కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన పనుల్లో వేగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అధికారుల కూర్పుపై ఇప్పటికే స్పష్టత రావడంతో తాజాగా కిందిస్థాయి సిబ్బంది, కొత్త మండలాల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, నియమించాల్సిన సిబ్బంది తదితర వాటిపై దృష్టి సారించింది. సిబ్బంది నియామకం, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ఈనెల 30వ తేదీలోపు నివేదికలివ్వాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 



ఈ నెల 20న జరిగిన సదస్సు అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి తాజాగా అందిన ప్రతిపాదనలను సీసీఎల్‌ఏ నివేదికలో పొందుపరిచారని తె లుస్తోంది. జిల్లాల సంఖ్య 24 లేదా 26 అనే అంశం పక్కనబెడితే, ప్రతిపాదిత జిల్లాల్లో తక్షణం కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పేర్కొన్నారని, మిగిలిన ప్రభుత్వ శాఖల విభజన కొంత ఆలస్యంగా జరిగినా ఇబ్బంది లేదని తెలిపినట్లు సమాచారం.



కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం భౌగోళికంగా ఉన్న పరిస్థితులను బట్టి మరిన్ని మండలాల ఏర్పాటు లేదా ఇప్పుడు ఒక మండలంలో ఉన్న గ్రామాలను మరో మండలంలోకి కలిపే ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి ఆయా జిల్లాల కలెక్టర్లు... భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ప్రతిపాదన పంపిస్తే సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలన్నింటినీ వీలైనంత వరకు ఒకే జిల్లాలో ఉండేలా కూర్పు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: