ఏపీ, తెలంగాణ మధ్య మరో పోరాటం సాగుతోంది. తెలంగాణ న్యాయమూర్తుల స్థానాలను కూడా ఆప్షన్ల పేరుతో ఆంధ్రా న్యాయమూర్తులు ఆక్రమిస్తున్నారన్నది తెలంగాణ వారి విమర్శలు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. రాష్ట్ర హైకోర్టు విభజనను సత్వరమే చేపట్టాలని కోరారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటైన తర్వాతే న్యాయాధికారులు, సిబ్బంది విభజన, కేటాయింపులు, నియామకాల ప్రక్రియ చేపట్టాలని కేంద్రానికి కేసీఆర్ సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 31వ సెక్షన్ ప్రకారం ఉమ్మడి హైకోర్టును విభజించాల్సి ఉన్నా... అది ఇంకా జరగనందున కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 


రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖనే కేసీఆర్.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్ కు కూడా పంపించారు. చత్తీస్ ఘఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ల ఏర్పాటు సమయంలో ఆయా రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటైన తర్వాతే కేటాయింపులు జరిగిన విషయాన్ని కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఆ కేటాయింపులు కూడా స్థానికత ఆధారంగా తీసుకునే జరిగాయని తెలిపారు.

ఇప్పటికే హైకోర్టు విభజన విషయంలో కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో వెళ్తున్నారన్న భావన కలుగుతోంది. కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ్ తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేసే ఆలోచనలో ఉన్నారన్నదానిపై స్పందించిన గౌడ.. కేజ్రీవాల్ తరహాలో కేసీఆర్ వెళ్తే వెళ్లొచ్చు అంటూ కామెంట్ చేశారు. మరి కేసీఆర్ ఎలాంటి  వ్యూహంతో కదులుతారో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: