మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. భూసేకరణ కోసం అనుసరిస్తున్న విధానంపై వివరాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జీవో 123 ద్వారా భూసేకరణపై ప్రభుత్వ వైఖరిని తెలపాలని హైకోర్టు పేర్కొంది. 

జీవో 123ను కొట్టివేసి.. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పదిహేను మంది రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణకు చేపట్టింది. ప్రభుత్వం జీవో 123 ద్వారా భూసేకరణ చేస్తే రైతులు నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. నూతన భూసేకరణ చట్టం రైతులకు కల్పించే ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆ న్యాయవాది వాదించారు. 


నీటి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచనున్నారని.. దానివల్ల ఐదు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని న్యాయవాది తెలిపారు. రైతులను బలవంత పెట్టబోమని అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ధర్మాసనానికి తెలిపారు. అంగీకరించిన రైతుల నుంచి జీవో 123 ప్రకారం సేకరిస్తామని.. లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారమే చేస్తామని వివరించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం ఆంధ్రాలో అనుసరిస్తున్న భూసేకరణ విధానం కూడా ఇలాంటిదే కదా అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన వివరణను ప్రమాణ పత్రం రూపంలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: