రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది.. ముందు కనీసం పాతిక నుంచి యాభై వరకు వాహనాలు ఉంటాయి. ఆ వెనకాల నుంచి ఒకటే హారన్ మోతలు. ముందు వాహనాలు కదిలే పరిస్థితి లేదని తెలిసినా, తమకు దారి ఇవ్వాలంటూ హారన్ కొట్టేవాళ్లను చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి పరిస్థితి మన దేశంలో సర్వసాధారణం. అనవసరంగా హారన్ మోత మోగించేవారి జేబుకిక చిల్లు పడనుంది. అనవసరంగా హారన్ కొట్టే వారిపై రూ. 500 నుంచి రూ. 5 వేల వరకూ జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. 



ఈ మేరకు మోటారు వాహన చట్టానికి వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. హారన్లు కొట్టేవాళ్లకు జరిమానాలు వడ్డించాలన్న ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘిస్తే రూ. 500, రెండోసారి అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫైన్ వేస్తారట. 



ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే హెడ్లైట్ ఫ్లాష్ చేయడంతో పాటు చిన్నగా ఒకసారి హారన్ కొడితే తప్పులేదు గానీ, అనవసరంగా పదే పదే మోగించేవాళ్లకు మాత్రం జరిమానాలు తప్పవట. ఇక సైలెంట్ జోన్లు... అంటే ఆసుపత్రులు, స్కూళ్లు తదితర హారన్ కొట్టరాదన్న బోర్డులు ఉండే ప్రాంతాల్లో తొలుత ఈ నిర్ణయం గట్టిగా అమలు చేయాలన్నది కేంద్రం ప్రయత్నం. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: