హైదరాబాద్ లోని జనసమ్మర్థ ప్రాంతాల్లో విచ్చలవిడిగా కాల్పులు జరపాలన్న ఆలోచనతో ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నగర శివారు ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ ను ప్రాక్టీస్ చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ప్రస్తుతానికి మత విద్వేషాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పూర్తి విచారణ అనంతరం కట్టుదిట్టమైన సెక్షన్లతో కేసులు పెడతామని తెలిపారు. రహస్య ప్రాంతంలో వీరిని తమదైన శైలిలో విచారిస్తూ, వారి నుంచి ఒక్కో విషయాన్నీ బయటకు తీస్తున్నారు. వీరి వద్ద అత్యంత ప్రమాదకర అమోనియం నైట్రేట్ కూడా లభ్యమైందని తెలుస్తోంది.



బాంబుల తయారీకి వాడే పలు ఎలక్ట్రిక్ ఉపకరణాలు కూడా లభ్యమైనట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. వీరిని అరెస్ట్ చేయకుంటే నగరంలో పెను విధ్వంసమే జరిగి ఉండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల అదుపులో  మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ,అబ్దుల్లా బిన్ మహ్మద్ అల్మోడీ, అబిన్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, ముజఫర్ హుస్సేన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. 



వీళ్ల వద్ద రెండు 9 ఎంఎం పిస్టళ్లతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీ, ఎలక్ట్రికల్ వస్తులు, అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 15 లక్షల నగదును కూడా ఎన్ఐఏ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ సందర్భంలో ఇబ్రహీం కుటుంబ సభ్యులు మీడియాపై దాడి చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటికి వెళ్లిన సమయంలో కూడా.. ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇబ్రహీం కుటుంబ సభ్యులు బెదిరించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: