ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌ను కోరారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే రోజా, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీలతో కలిసి సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ప్రస్తుత ఏపీ స్పీకర్‌గా ఉన్న కోడెల శివపస్రాదరావు తాను ఎన్నికల్లో రూ.11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, అందుకే ఆయనపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.



ఎందరో మహామహులు కూర్చున్న స్పీకర్ స్థానంలో అడ్డదారిలో గెలిచి ఆ సీటులోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు అనర్హుడని ఆయన్ను తక్షణమే స్పీకర్ పదవినుంచి, ఎమ్మెల్యే పదవినుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఓటుకు నోటుతో ఎమ్మెల్యేలను కొంటారు, ఈయనేమో ప్రజలను కొన్నట్టు చెబుతున్నారు...ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గు చేటైన విషయమని అన్నారు. అసెంబ్లీలో నియమాలు, నిబంధనలు అంటూ చెప్పే స్పీకర్‌కు ఇలా కోట్లు వెదజల్లి శాసనసభకు వచ్చారని, ఆయనకు నీతులు మాట్లాడే నైతిక అర్హత ఏ మాత్రం లేదని అన్నారు.



ఈమేరకు వినతి పత్రంతో పాటు కోడెల శివప్రసాదరావు మాట్లాడిన టేపులను సీడీల రూపంలో భన్వర్‌లాల్‌కు అందజేశారు. అనంతరం సచివాలయంలో మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో తనపై 924 ఓట్లతో కోడెల శివప్రసాదరావు గెలుపొందారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రూ.11.5 కోట్లు ఖర్చు చేసినందునే ఆయన 924 ఓట్లతో గెలుపొందినట్టు భావిస్తున్నానని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికల నిబంధనల మేరకు రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని, కానీ కోడెల శివప్రసాదరావు ఇందుకు భిన్నంగా 40 రెట్లు అధికంగా ఖర్చు చేశారన్నారు. రూ.11.5 కోట్లు ఖర్చుచేసినట్టు తానే స్వయంగా ఒప్పుకున్నందున ఇంతకంటే ఆధారాలు అవసరం లేదని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: