కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సరంభంలోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు-చేర్పులకు రంగం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్ విస్తరణ నేడు జరగనుందంటూ నిన్న వార్తలు వినిపించాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 లేదా 5కు వాయిదా వేసుకున్నారని తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యే వారి పేర్లతో పాటు కొత్తగా కేంద్ర మంత్రి పదవులు వరించే వారి లిస్టు కూడా ఇదేనంటూ జాతీయ మీడియా పలు ఊహాగానాలతో కథనాలు రాస్తోంది. 


ఈసారి మార్పులు-చేర్పులు భారీగానే ఉంటాయని వినిపిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలకు కెబినెట్ బెర్త్ లభించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి యూపీ నేతలు పలువురికి చాన్స్ లభించవచ్చునని సమాచారం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టమైన సమాచారం లభించడంతో రాష్ట్రపతి భవన్ లోనూ ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.


కొత్తగా మంత్రులు కానున్న వారిలో పార్టీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్య నాథ్, సహరాన్ పూర్ ఎంపీ రాఘవ్ లఖన్ పాల్, మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లా, అదే రాష్ట్రానికి చెందిన మరో ఎంపీ రాజ్ వీర్ సింగ్ లకు కేబినెట్ బెర్తులు ఖరారైనట్లు సమాచారం. ఇక 75 ఏళ్లకు పైబడిన వయసు, ఆ మార్కుకు దరిదాపుల్లోకి వచ్చిన కేంద్ర మంత్రులను ఇంటికి సాగనంపేందుకు కూడా మోదీ నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి వారిలో కేంద్ర మంత్రులు నజ్మా హెప్తుల్లా, గిరి రాజ్ సింగ్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: