ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు విచారణలో కీలక పరిణామం. స్వాతిని హత్యచేసిన నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను చెన్నై పోలీసులు గురువారం విడుదల చేశారు. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఈ హత్యకేసు విచారణను రైల్వే పోలీసుల నుంచి చెన్నై పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.



 ఈమేరకు ఇవాళ పోలీసులు మొదటిసారిగా ఈ మర్డర్ కేసులో నిందితుడిగా భావిస్తోన్న వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. నిందితుడిని గుర్తుపట్టిన వారు 1512కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్లాట్‌ఫాంపై టెక్కీని కత్తితో పొడిచి అదరబాదరగా పారిపోతున్నట్టు కనిపిస్తోంది. స్టేషన్‌కు సమీపంలోని ఓ బిల్డింగ్‌పై ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరా ఫూటేజీ ఆధారంగా పోలీసులు ఈ ఫోటోను సంపాదించారు. స్వాతి హత్య తమిళనాడు వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. 



స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ ఫొరెన్సిక్ సంస్థ సాయంతో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోలను చెన్నై పోలీసులు సంపాదించినట్టు సమాచారం. స్వాతి హత్య జరిగి వారం రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో నిందితుడి స్పష్టమైన ఫొటోను విడుదల చేయడం ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: