ఉమ్మడి హైకోర్టు విభజన వ్యవహారం ఏపీ, తెలంగాణల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అవసరమైతే హైకోర్టు సత్వర విభజన కోసం డిల్లీ బాట పడతానని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నాడు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేసేందుకైనా వెనుకాడబోనని సంకేతాలు పంపుతున్నాడు. విషయ తీవ్రత చెప్పేందుకు అన్నంతపని చేసినా చేస్తాడు కేసీఆర్. 

ఐతే.. హైకోర్టు విభజనతో కేంద్రం పాత్ర పరిమితం అంటున్నారు బీజేపీ నేతలు. హైకోర్టు విభజనలో తమ పాత్ర ఏమీ లేదని కావాలంటే కేసీఆర్ దీక్ష చేసుకోవచ్చని సాక్షాత్తూ కేంద్ర న్యాయశాఖమంత్రే స్వయంగా చెప్పారు. ఐతే.. కేసీఆర్ డిల్లీలో కాకుండా అమరావతిలో దీక్ష చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. అమ‌రావ‌తిలో అంటూ సెటైర్ వేస్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్. హైకోర్టు విభ‌జ‌న అంశంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూర్చోబెట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ఈ విషయంలో కేసీఆర్ పంతాలకు పోకూడదని సలహా ఇస్తున్నారాయన.

కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు ఏర్పాటుకు ఇప్ప‌టికే రూ.100 కోట్లు కేటాయించిద‌ని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఆప్షన్ల విధానంలో తెలంగాణ న్యాయ‌వాదుల‌కు జ‌రుగుతోన్న అన్యాయం ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ క‌ల్పించుకొని ప‌రిష్కారాన్ని చూపాల‌ని లక్ష్మణ్ అంటున్నారు. కేసీఆర్ లాయర్ల తరపున దీక్ష చేయడాన్ని తాము తప్పు పట్టబోమని,కాకపో్తే అది అమరావతిలో జరగాలని ఆయన అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: