వైఎస్ జగన్ విలాసాలపై గతంలో మీడియాలో చిలవలు పలువగా కథనాలు వచ్చాయి. ఆయనకు హైదరాబాద్ లో 70 పడకగదులకుపైగా ఉన్న లోటస్ పాండ్  భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇక బెంగళూరులోని ఎలహంకలోనూ రాజప్రాసాదాన్ని తలపించే ఇంద్రభవనం ఉంది. మరోవైపు సొంత జిల్లా కడపలోనూ సొంత భవనాలు ఉన్నాయి. 

ఐతే.. తాజాగా అక్రమాస్తుల కేసులో ఈడీ హైదరాబాద్, బెంగళూరుల్లోని ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేయడమంటే స్వాధీనం చేసుకోవడం కాదు.. లేకపోతే తాళాలు వేసి లక్క సీలు వేయడమూ కాదు.. కేవలం ఆ ఆస్తులపై కొనుగోలు, అమ్మకాలకు అవకాశం ఉండదు. కానీ ఈ  విషయాన్ని టీడీపీ నేతలు పొలిటికల్ మైలీజీగా తీసుకుంటున్నారు. 


జగన్ ను సాధ్యమైనంతగా అప్రదిష్టపాలు చేసేందుకు విమర్శలు ప్రారంభించారు. దాదాపు టీడీపీలోని ప్రతి నాయకుడు జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ పై ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు గుప్పించారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరో అడుగు ముందుకేశారు. హైదరాబాద్, బెంగళూరుల్లోని నివాసాలు అటాచ్ చేసినందువల్ల జగన్ కోరితే..  అమరావతిలో ఉండేందుకు చక్కటి భవనం నిర్మించి ఇస్తామన్నారు. 

జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ ఇక్కడితో ఆగబోదని.. త్వరలో మరో రూ.వెయ్యి కోట్ల ఆస్తులు అటాచ్‌ చేసే అవకాశం ఉందని కేఈ అంటున్నారు. వాస్తవానికి జగన్ కూడా హైదరాబాద్ విడిచే ఆలోచన చేయడంలేదు.. ఏపీ ప్రతిపక్షనేత అయినా.. అన్నీ కార్యాలయాలు విజయవాడకు తరలిపోతున్నా.. జగన్ మాత్రం అమరావతి వైపు చూడటం లేదు. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన బంపర్ ఆఫర్ బాగానే ఉంది మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: