తాను నోరు తెరిస్తే దేశం మొత్తం షేకైపోతుందని మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చిన కారణంగా ఖడ్సే ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పదవి నుంచి తప్పుకున్నాక దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం సాయంత్రం ఖడ్సే తన నియోజకవర్గం జల్‌గావ్‌లో మద్దతుదారులనుద్దేశించి మాట్లాడితూ.. 



అవినీతి ఆరోపణల పేరుతో తాను రాజీనామా చేసినప్పటికీ, తాను నోరు తెరిస్తే దేశం మొత్తం షేక్‌ అవుతుందని అన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌పై కూడా ఖడ్సే స్వల్ప విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు భాజపా శివసేన కూటమి విడిపోవడానికి తానే కారణమని.. అయితే అందువల్లే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి భాజపాకు దక్కిందని లేదంటే శివసేనకు దక్కి ఉండేదని ఖడ్సే పేర్కొన్నారు. తాను అలా చేయడం వల్లే మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాగలిగాడని ఆయన తెలిపారు.



 లేని పక్షంలో సీఎం పీఠం శివసేనకు దక్కేదని ఆయన తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌లో ఖడ్సే పలు కీలక పాత్రలు పోషించారు. భూమికి సంబంధించిన డీల్స్‌, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ నుంచి ఖడ్సేకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తదితర ఆరోపణల కారణంగా ఆయన పదవికి రాజీనామా చేశారు. ఫడణవీస్‌ ప్రభుత్వం ఖడ్సేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: