తిరుపతి అంటే గుర్తొచ్చేది ఏడుకొండల వెంకన్న స్వామే. కానీ ఇకపై తిరుపతి అంటే డిజిటల్ టెక్నాలజీ గుర్తొచ్చే రోజులు వస్తున్నాయట. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో  నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ స్కిల్స్ శిక్షణ అందించేందుకు ఇంటర్నేషనల్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ను తిరుపతిలో ఏర్పాటు చేస్తారట.

దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 కోట్ల రూపాయలు విడుదల చేసిందట. ఎస్వీ విశ్వవిద్యాలయంలో 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో ఈ విద్యా సంవత్సరం నుంచే శిక్షణ తరగతులు ప్రారంభిస్తారట. ఈ IIDTలో డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ వంటి నైపుణ్య అంశాలపై శిక్షణ అందిస్తారు.


అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన బర్క్‌లీ, యూటీ-అస్టిన్ వంటి విశ్వవిద్యాలయాలతో పాటు వివిధ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణుల ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుంది. సిలికాన్ వ్యాలీ నుంచి కూడా ఆయా రంగాల్లో నిపుణులు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇస్తారు.

IIDTలో శిక్షణ పొందేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో సీటు పొందాలంటే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది. తొలి సంవత్సరం 200సీట్లతో సంస్థను ప్రారంభిస్తారు. ఒక్కో శిక్షణాంశంలో 20మందికి శిక్షణ అందిస్తారు. ఐఐడీటీకి మూడేళ్ల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.

నాలుగో ఏడాది నుంచి IIDT సొంత వనరులను సమకూర్చుకున్న స్వతంత్ర సంస్థగా శిక్షణ అందించనుంది. ఐఐడీటీకి ఎంపికయ్యే విద్యార్థులు ఏడాది కోర్సు కోసం రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీజు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రానున్న రోజుల్లో 1500మందితో తరగతులు జరిగేలా లక్ష్యాలను పెంచుకోవాలని నిర్థేశించుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: