ఎక్కడ తిరునెల్వేలి... ఎక్కడ చెన్నై?.... నిందితుడు రామ్‌కుమార్‌ చెన్నై రావడమేంటి.., స్వాతి ఇంటికి సమీపంలోని మాన్షన్‌లో నివాసం ఉండటమేంటి?... అసలు ఎలా ప్రేమించాడు? అనే అంశాలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. హత్యకు దారితీసిన పరిస్థితులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల నుంగంబాక్కం రైల్వే స్టేషనులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని స్వాతి దారుణహత్యకు గురైన కేసులో రామ్‌కుమార్‌ అనే యువకుణ్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.



రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి చెన్నైకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తరలించారు. పోలీసులు తమ దైన శైలిలో విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఫేస్‌బుక్ ద్వారా స్వాతితో ఏర్పడ్డ పరిచయం, ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు. తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించినట్టు, అందుకే పదే పదే వెంటబడ్డట్టూ వివరించాడు. అదే సమయంలో తన ప్రేమకు మధ్యవర్తి ఓ మిత్రుడు వ్యవహరించినట్టు రామ్‌కుమార్ పేర్కొనడంతో అతగాడి కోసం విచారణ మొదలెట్టారు.



చివరకు తనను తిరస్కరించిన స్వాతి కొండముచ్చు వలే ఉన్నావని పదే పదే వ్యాఖ్యానించడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి సమీపంలోని ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని చెన్నైకు వెళ్లినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ రోజు ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదు అని, ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించానని, అయితే, ఆమె మాటలు ఉన్మాదిని చేసినట్టు, హంతుకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.



రామ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు... అతడు ఉన్న మేకలదొడ్డిలోని గదిలో కొన్ని ఖాళీ మద్యం సీసాలను గుర్తించారు. స్వాతి హత్య తర్వాత సొంతూరుకు తిరిగొచ్చిన అతడు నేరభావంతో తల్లిదండ్రుల మధ్య ఉండలేక ఇంటి ప్రాంగణంలోని మేకల దొడ్డికి మకాం మార్చుకున్నాడని భావిస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్కడే మద్యం తాగి పడుకునేవాడని తెలిసింది. తనలోని మార్పు కుటుంబసభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడటం కోసమే అతడు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాడని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: