ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రా రావు నేడు రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన సందర్భంలో ఈ బిల్లు రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రినే టార్గెట్ చేసుకొని బిల్లును ప్రవేశపెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానిపై ఓటింగ్ జరిగేలా చూడాలని కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై ఇప్పటికే చర్చ జరిగిందని, ఇప్పుడు నేరుగా ఓటింగు జరగాలని ఎపి కాంగ్రెసు అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. 



ఇందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీలు ఇప్పటికే బిల్లుకు మద్దతిచ్చాయని, మిగతా పార్టీలను కూడా సంప్రదిస్తామని చెప్పారు. ఈ విషయంపై మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో సమాలోచనలు జరిపినట్టు తెలిపారు.



కవేళ బిల్లు చర్చకు వస్తే బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టింది, దాన్ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగిస్తూ అప్పటి ప్రధాని చేత ప్రకటన చేయించిందీ ఆయనే. పైగా, తామే అధికారంలోకి వస్తాం కాబట్టి ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అదే మాట చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన మాట మార్చినట్లు కనిపిస్తున్నారు. దీంతో వెంకయ్య నాయుడిని ప్రతిపక్షాలు లక్ష్యం చేసుకుని బిజెపిని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, బిల్లు చర్చకు రాకుండా చూస్తామని బిజెపి పార్లమెంటు సభ్యుడు హరిబాబు ఇంతకు ముందు అన్నారు.



సభ సజావుగా సాగితే కాంగ్రెసుకు రాజ్యసభలో మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో కెవిపి బిల్లు గట్టెక్కే అవకాశమే ఉంది. రాజ్యసభలో గట్టెక్కినా లోకసభలో కష్టమనే ధీమాతోనే బిజెపి ఉందా అనేది కూడా తెలియడం లేదు. అయితే, ఒకవేళ అదే జరిగితే బిజెపి అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరిద్దామనే వ్యూహం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఏమైనా బిల్లుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: