ఐదేళ్ల క్రితం ఇదే వెస్టిండీస్ పర్యటనతో తన కెరీర్లో ఆరంగేట్రం చేసినప్పుడు.. అతడు ఒకరకంగా చెప్పాలంటే పాలబుగ్గల పసివాడు. అరివీర భయంకరులైన వెస్టిండీస్ బౌలర్లను చూసి భయపడ్డాడు... దాంతో తడబడ్డాడు. కానీ ఇప్పుడు, టీమిండియాను వరుస విజయాల బాటలో నడిపిస్తున్న విజయవంతమైన కెప్టెన్ హోదాలో మళ్లీ అదే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు. మొదటి టెస్టు మొట్టమొదటి రోజే అజేయంగా 143 పరుగులు చేసి.. తానేంటో వెస్టిండియన్లకు చూపించాడు. ఇదీ తన అసలైన సత్తా అని రుజువు చేశాడు.



కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (143 నాటౌట్‌) శతకంతో చెలరేగడంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 302/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కోహ్లికి తోడుగా అశ్విన్‌(22) క్రీజులో ఉన్నారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ విజయ్‌(7) వికెట్‌ కోల్పోయింది. అనంతరం పుజారా(16) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌ తడబడింది. అయితే ఈ దశలో ఓపెనర్‌ ధావన్‌(84)కు జత కలిసిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. విండీస్ బౌలర్లలో దేవేంద్ర బిషూ 3, గాబ్రియెల్ ఒక్క వికెట్ పడగొట్టారు.



సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ కెప్టెన్గా టెస్టుల్లో 1000 పరుగులు పూర్తిచేసుకోవడం విశేషం. విండీస్ పై శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్లలో మూడోవ్యక్తిగా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. 1982-83లో స్పెయిన్‌లో కపిల్‌దేవ్‌ (100) పరుగులు చేయగా, 2006లో రాహుల్‌ ద్రావిడ్‌ 146 పరుగులు చేశాడు. మరో 4 పరుగులు జతచేస్తే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ గానూ మరో రికార్డుకు కోహ్లీ చేరువలో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: