కశ్మీర్‌ విషయమై పాకిస్తాన్‌కు భారత్ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఖాళీ చేసి వెళ్లాలని స్పష్టం చేసింది. మరోవైపు కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపేస్తామంటూ ఇస్లామాబాద్‌లో ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ భారీ ర్యాలీ నిర్వహించాడు. పాకిస్తాన్‌లో భారత్ వ్యతిరేక ప్రదర్శనలను భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తులు పాకిస్తాన్‌లో బహిరంగంగా తిరుగుతూ, ర్యాలీలు నిర్వహిస్తున్నా నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడింది. 



కశ్మీర్‌లో ఆందోళనలకు దిగే గుంపులను చెదరగొట్టేందుకు పెల్లెట్లు పేల్చే తుపాకుల్ని ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందించారు. ప్రాణహాని లేని ఇతర ప్రత్యామ్నాయాల దిశగా ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. లోక్‌సభలో కశ్మీర్‌లో అశాంతిపై జరిగిన చర్చలో మాట్లాడారు. పెల్లెట్‌ తుపాకుల కారణంగా చోటుచేసుకున్న గాయాలపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. హోంమంత్రి స్పందిస్తూ.. పెల్లెట్‌ తుపాకులకు ప్రత్యామ్నాయాల్ని సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామనీ, రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.



అటు పాక్‌లో ఉగ్రవాద అనుబంధ సంస్థలు విషం కక్కుతూనే ఉన్నాయి. లష్కర్‌ ఉగ్రవాద నేత హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలో ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీ జరిగింది. కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపే వరకు పోరాటం ఆపబోమని సయీద్‌ ప్రకటించాడు. కశ్మీర్‌ ప్రజలకు తాము అండగా ఉంటామని చెప్పాడు. భారత సైనికులు అమాయక కశ్మీరీలను ఉగ్రవాదుల పేరుతో చంపుతున్నారని, కశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్తాన్‌లో భాగమేనని హఫీజ్‌ అన్నాడు. దాడులతో భారత్‌ను ఊపిరాడకుండా చేస్తామని ఆయన వెల్లడించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: