ఓ కుర్ర ఎంపీ చేసిన పిల్ల చేష్ట.. ఏపీకి చేటు చేసింది. ఆమ్ ఆద్మీపార్టీ ఎంపీ భగవంత్  మాన్ వ్యవహారం పార్లమెంటును స్తంభింపజేసింది. భారతీయజనతాపార్టీ, శిరోమణి అకాళీదళ్  సభ్యులు పార్లమెంట్  భద్రతకే ముప్పువాటిల్లే చర్యకు పాల్పడిన మాన్ పై చర్యలు చేపట్టాలంటూ ఆందోళనకు దిగారు. వారికి ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. 

ఒక దశలో బీజేపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి మరీ నిరసన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్య సభ పలుసార్లు వాయిదా పడింది. అటు లోక్ సభలోనూ సేమ్ సీన్.. వీడియో చిత్రీకరించిన భగవంత్  మాన్ పై చర్యలు తీసుకోవలంటూ బీజేపీ ఆందోళన చేపట్టంది. పార్టీలకు అతీతంగా సభ్యులు మాన్ పై ధ్వజమెత్తారు. 


ఈ హడావిడిలో రాజ్యసభలో ఈ మధ్యాహ్నం ఒటింగ్ వస్తుందనుకున్న ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుకు అవకాశం దక్కకుండానే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠగా టీవీలు చూసిన ఏపీ అభిమానులకు ఈ ఆప్ ఎంపీ గొడవ చిర్రెత్తుకొచ్చింది. బీజేపీ కూడా మాయావతి ఇష్యూను పక్కదారి పట్టించడానికి మంచి ఇష్యూ దొరికిందని సంతోషించినట్టుంది. 

మొత్తానికి శుక్రవారం ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరగకుండానే రాజ్యసభ వాయిదాపడింది. కేవీపీ మొదలు పెట్టిన ఈ ప్రత్యేక బిల్లు డ్రామా బాగా రక్తికడుతుందనుకున్న సమయంలో ఇలా కుర్ర ఎంపీ వీడియో గొడవతో పుణ్యకాలం కాస్తా కరిగిపోయింది. మరి సోమవారమైనా కేవీపీ బిల్లుకు అవకాశం ఉంటుదో ఉండదో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: