ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. ఉద్యోగులపై మండిపడ్డారు. ప్రజా సాధికార సర్వేను ఉద్యోగులు లైట్ గా తీసుకుంటే సహించేది లేదన్నారు. సర్వే వేగం పుంజుకోవాలని, ఆషామాషీగా భావిస్తే కఠిన చర్యలకు వెనుకాడేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సాంకేతిక అంశాలను కారణంగా చెప్పి తప్పించుకోవాలని చూడొద్దన్నారు. 

ఉన్నతాధికారులు, మంత్రులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారులు డేటాను పరిశీలించాలన్నారు. ప్రజా సాధికార సర్వేకు నెట్‌వర్కింగ్, కచ్చితత్వం,నాణ్యతతో కూడిన సమాచారం చాలా అవసరమని సీఎం చెప్పారు. సాఫ్ట్‌వేర్  ఉద్యోగి, డివైడర్ చేసే ఉద్యోగి, ట్రెయినింగ్  ఇచ్చే ఉద్యోగి, ఇన్నోవేషన్‌లో ప్రవేశం ఉన్న ఉద్యోగి..ఈ నలుగురూ ఒక బృందంగా ఉంటే బాగుంటుందన్నారు. 


ఇటీవల తాను చైనా, రష్యా, కజకిస్థాన్  దేశాల్లో పర్యటించినప్పుడు  సీఎం డ్యాష్ బోర్డు లో రియల్ టైమ్ మానిటరింగ్‌పై వివరించినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వటాన్ని వారు మెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా నాలుగో పారిశ్రామికవిప్లవం నడుస్తున్నదన్నారు సీఎం. 

అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు పల్స్ సర్వే బృందాలకు శిక్షణనిస్తారని సీఎం అంటున్నారు. సేకరించే సమాచారంలో కచ్చితత్వం ఉండాలని, సమగ్రత ఉండాలని ఆయన సూచించారు. 5 వ తేదీలోగా పెన్షన్లు ఇచ్చేవారికి పెన్షన్ సొమ్ము చెల్లించి, తిరిగి సిబ్బంది సమగ్ర సర్వేలో బిజీ కావాలని, పై అధికారులు వేరే పనులు చెప్పినా వినకుండా సమగ్ర సర్వేకు కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: