ఉత్తర్‌ప్రదేశ్‌లో కులం పేరిట, ఆశ్రిత పక్షపాతంతో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రియమైన యువజనులారా! అభివృద్ధికి ఆ రాజకీయాలు దోహదపడవు. అలాంటి రాజకీయాలు చేసేవారు మనకొద్దు. మీరు అందరి జేబులూ నింపారు. కానీ మీ జేబు మాత్రం నిండలేదు. మీరు అందరికీ మద్దతు ఇచ్చారు. మరి మీకు వారి నుంచి మద్దతు లభించిందా? యువత, రైతాంగం లబ్ధి పొందిందా? మునుపటి లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే మరోసారి మీ మద్దతుతో నన్ను ఆశీర్వదించండి. 


కులతత్వ, కుటుంబ రాజకీయాలను పక్కనపెట్టి.. ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి రాజకీయాలను ప్రోత్సహించాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని, ఇందుకోసం ప్రజలు తనకు మద్దతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ యువతకు విజ్ఞప్తి చేశారు. యూపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాను తీసుకున్న చర్యల గురించి వివరించడంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. యూపీలో ప్రజారోగ్యానికి సంబంధించి కేంద్రం రూ. 7 వేల కోట్ల నిధులను అందించగా యూపీ ప్రభుత్వం రూ.2,850 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. 



ప్రజల కోసం పనిచేయని ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదని, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే తనలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుతున్న ఎయిమ్స్ సేవలను యూపీ ప్రజలకు కూడా అందించాలనే లక్ష్యంతోనే గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 750 పడకల సామర్థ్యం కలిగిన ఎయిమ్స్‌ను రూ. వెయ్యి కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.


రెండు చక్రాలూ బలంగా, సమతుల్యతతో ఉన్నప్పుడే ప్రగతిరథం పరుగులు తీస్తుంది. ఒక చక్రం తూర్పు భారతమైతే, మరొకటి పశ్చిమభారతం. ఒక చక్రమే బలంగా ఉంటే రథం వేగంగా పరుగులు తీయదు’ అని మోదీ చెప్పారు. రెండో హరిత విప్లవం మొదలైతే అది తూర్పు యూపీ నుంచేనని అన్నారు. తాను అధికార పగ్గాలు చేపట్టాక నల్లబజారుకు యూరియా తరలిపోవడానికి అడ్డుకట్ట వేశాననీ, అందువల్లనే ఎక్కడా రైతులు దానికోసం లాఠీదెబ్బలు తినాల్సిన పరిస్థితి లేదనీ చెప్పారు. ఎరువులు కావాలంటూ గత ఒకటిన్నరేళ్లలో ఏ ముఖ్యమంత్రి నుంచీ తనకు లేఖ రాలేదన్న విషయాన్ని గర్వంగా చెప్పుకోగలనన్నారు. వేపపూత ప్రవేశపెట్టాక యూరియా సులభంగా దొరుకుతోందని చెప్పారు. భవిష్యత్తులో దీని దిగుమతులకు స్వస్తి చెప్పడమే కాకుండా విదేశాల్లోనే యూరియాను ఉత్పత్తి చేయించి తీసుకువస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: