ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల పొలాల్లోకి వచ్చి డిజైన్లను రూపొందించాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరిట మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలను మూడోసారి ముంచితే సహించేది లేదని, నిర్వాసితుల పక్షాన జేఏసీ పోరాడుతుందని తెలిపారు. ఓసారి శ్రీశైలం ప్రాజెక్టుతో, రెండోసారి కేఎల్‌ఐ ప్రాజెక్టుతో జిల్లా ప్రజలు ముంపునకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.



పాలమూరు ఎత్తిపోతలపై ఆయన రెండు రోజుల అవగాహనయాత్ర నిర్వహించారు. శుక్రవారం నాగర్‌కర్నూలులో ఆచార్య హరగోపాల్‌తో కలిసి మీడియా కోదండరాం మాట్లాడారు. ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు నీరిస్తామంటే ఎవరూ కాదనరన్నారు. తమ భూముల్లో బ్లాస్టింగ్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని నార్లాపూర్‌ జలాశయం ముంపు రైతులు చెబుతున్నారన్నారు. 123 జీవో ప్రకారం బాధితుల హక్కులు నెరవేరవని, భూమి కొనుగోలు మాత్రమే పూర్తవుతుందన్నారు. 



నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వాసితులను కలుసుకున్నారు. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు లిఫ్టు పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు కోదండరాం ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో తక్కువ ముంపునకు గురయ్యేలా చూసే అవకాశాలున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని కోదండరామ్‌ అన్నారు. జూరాల, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ల ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి భూములు నష్టపోకుండా చూడాలన్నారు. కోడేరు మండలం తీగలపల్లి, బిజినేపల్లి మండలం వట్టెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ప్రాంతాలను కూడా ఆయన సందర్శించారు.



ప్రాజెక్టుల డిజైన్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలే తప్ప.. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉండరాదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీ.. గత ప్రభుత్వాల మాదిరిగానే ఆలోచించడం తగదన్నారు. ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఎందుకు ఆలోచించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంఘాలకు పదవులు, డబ్బుల ఆకాంక్ష లేదని, ఉద్యమ స్ఫూర్తి మాత్రమే ఉందని అన్నారు. ప్రజలకనుగుణంగా ప్రాజెక్టులను డిజైన్‌ చేయాలని, లేదంటే ఉద్యమిస్తామని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: