త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ యంత్రాగం సర్వం సిద్ధం చేస్తున్న సమయంలో, భక్తులంతా కృష్ణా నదిలో స్నానం చేసి పరితపించిపోవాలని సంబరపడుతున్న సమయంలో ఒక షాకింగ్ న్యూస్ అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను కలవరపెడుతుంది. కృష్ణానదిలో రాక్షస చేపలు జాలర్లను దడ పుట్టిస్తున్నాయి. లక్షల సంఖ్యలో నదిలోకి ప్రవేశించిన ఈ చేపలు.. నదిలో ఉన్న మిగిలిన చేపలను తినేస్తూ, నదిని కలుషితం చేసేస్తున్నాయి.



స్వచ్ఛమైన మంచినీటి చేపలకు కృష్ణానది పెట్టింది పేరు. వేలాది మంది మత్య్సకారులు ఈ సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా వారి జీవనోపాధి ఈ రాక్షస చేపల కారణంగా పూర్తిగా దెబ్బ తినిపోయింది. ఒంటినిండా ముళ్లు, సూదుల్లాంటి పళ్లతో ఉన్న ఈ చేపలు లక్షల విలువచేసే వలల్ని అవలీలగా చీల్చిపారేస్తూ, మత్య్సకారులను బెంబేలెత్తిస్తున్నాయి. వీటిని చేతితో పట్టుకునేందుకు ప్రయత్నిస్తే రక్తం కళ్లచూస్తున్నాయి. చేతులను, కాళ్లను పదునైన పళ్లతో, ముళ్లతో గుచ్చేస్తూ, తీవ్రగాయాలపాల్జేతున్నాయి. 



ఈ రాక్షస చేపలు మత్య్సకారుల వలల్లో పెద్దఎత్తున చిక్కుతున్నాయి. అయితే తినేందుకు పనికి రాకపోవడంతో వీటిని పడేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో దాదాపు మూడు టన్నుల చేపలు వలల్లో పడగా, వాటన్నింటిని పక్కన పడేస్తున్నారు. ఈ చేపలు.. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని విడుదల చేసిన తర్వాతే కనపడుతుండడంతో పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ఇవి వచ్చినట్లు అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వలలు చిరిగిపోయి, మరోవైపు మంచి చేపలు పడక నష్టపోతున్నామని, వెంటనే మత్య్సశాఖాధికారులు స్పందించి, పరిష్కార మార్గాలు చూపించాలని మత్య్సకారులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: