ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్ర పన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలన్న సదుద్దేశం బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కనిపించడం లేదు. ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. ఒక చట్టానికి సంబంధించి ప్రధానమంత్రి, మంత్రి చేసిన ప్రకటన కూడా ఆ చట్టంలో ఒక భాగం అవుతుంది. ప్రత్యేకంగా ఒక నిబంధనను పొందుపరచకపోయినా ఆ చట్టాన్ని అర్థం చేసుకునేందుకు వారు ఏం మాట్లాడారనే దాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. 



‘‘బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. ఎలాగైనా బిల్లును రానివ్వకూడదనే ఉద్దేశంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి. ఏ పార్టీ సభ్యుడైతే బిల్లును ప్రవేశపెట్టాడో.. ఆ పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేసి అంతరాయం కలిగించారు. బిల్లును పొడిగించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోంది. న్యాయస్థానాలు తప్పనిసరిగా న్యాయం చేస్తాయి. ప్రత్యేక హోదా బిల్లుకు మేం తప్పనిసరిగా మద్దతు ఇస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నాం. కాంగ్రెస్, టీడీపీ లాగా మేం డ్రామాలు ఆడడం లేదు. చిత్తశుద్ధితో పోరాటం సాగిస్తున్నాం. కోర్టుకు వెళ్లయినా సరే హోదా సాధిస్తాం. మిగిలిన పార్టీకు చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుంది’’ అని స్పష్టం చేశారు.

‘హోదా’ కోసం లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు పెడతాం


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తమ పార్టీ ప్రైవేట్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ మూడుసార్లు లోక్‌సభను స్తంభింపజేసిందని తెలిపారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హోదా సాధన కోసం తమ పార్టీ గుంటూరులో ఎనిమిది రోజులపాటు దీక్ష చేసిందని గుర్తుచేశారు. దీనిపై వివిధ జిల్లాల్లో ఆందోళన చేపట్టామన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన  ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సుబ్బారెడ్డి విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: