జంటిల్ మన్ లా కనిపించే బిజినెస్ మెన్ కం పొలిటీషియన్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై ఓ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది. సొంత పార్టీ వాడే కదా అని అభిమానంతో ఇల్లు అద్దెకు ఇస్తే.. ఇప్పుడు దాన్ని అడ్డదారుల్లో దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ మీడియా ముందుకు వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రిని కలసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. పద్మజ అనే మహిళ గుంటూరులోని తన ఇంటిని ఎన్నికల సమయంలో గల్లా జయదేవ్ కు అద్దెకు ఇచ్చిందట. ఆ తర్వాత తమకు వ్యాపారంలో నష్టం వచ్చి ఇంటి లోన్ కట్టలేకపోయామని చెబుతోంది. దాన్ని సాకుగా తీసుకుని దాన్ని మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పద్మజ ఆరోపిస్తోంది. 


తమ ఇంటి మార్కెట్ విలువ ప్రస్తుతం 8కోట్ల రూపాయలు ఉందని.. కానీ ఎంపీ సూచనతో బ్యాంకు అధికారులు దానికి  కేవలం 2కోట్ల 80లక్షలుగా ధర నిర్ణయించారని అంటోంది. జయదేవ్ రాజకీయ పలుకుబడి ఉపయోగించి హైకోర్టులో ఉన్న స్టే ని వేకేట్ చేయించారని కూడా పద్మజ చెబుతోంది. జయదేవ్ బ్యాంకు అదికారులపై ఒత్తిడి తెచ్చి ఇంటిని వేలం పెట్టేలా చేస్తున్నారని ఆమె చెబుతోంది. 

ఈ ఇష్యూ మీడియా ప్రముఖంగా వస్తుండటంతో జయదేవ్ నష్టనివారణ చర్యలకు దిగారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.  ప్రస్తుత నివాసానికి 2017వరకు లీజు అగ్రిమెంట్ తమ వద్ద ఉందని తెలిపారు. ఇంటి యజమాని ఆంధ్రా బ్యాంకు వారి వద్ద తీసుకున్న రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నందున.. నిబంధనల మేరకు అధికారులు వేలం నోటీసు ఇచ్చారని అంటున్నారు. తాము నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొని అందరికంటే అధిక ధర చెల్లించి భవనం తీసుకున్నామని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: