ఉగ్ర ఘాతుకానికి ఈసారి కాబూల్ బలైంది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 80 నిండు ప్రాణాలు బలయ్యాయి. 231 మంది గాయాల పాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సంఘటన తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చని అధికారులు తెలిపారు.

కాబూల్‌లో ఉగ్రదాడి


మైనారిటీ షియా హజారాలు భారీ విద్యుత్తు ప్రాజెక్టు కోసం ఆందోళన చేస్తున్న సమయంలో జంట పేలుళ్లు సంభవించాయి. తెగిపడిన అవయవాలు, రక్తసిక్తమైన దేహాలతో సంఘటన స్థలం భీతావహంగా మారింది. నెత్తురోడిన రహదారులతో భయానక వాతావరణం నెలకొంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.



హజారాలు అత్యధికంగా నివసించే.. వెనుకబడిన ప్రాంతమైన బమ్యాన్‌, వార్డాక్‌ ప్రాంతాల్లో విద్యుత్తు ప్రాజెక్టు కోసం అధిక సంఖ్యలో ప్రజలు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులు ముందురోజు రాత్రే ఆ ప్రాంతానికి అన్నివైపులా రాకపోకలను నిషేధిస్తూ పెద్ద కంటెయినర్లను అడ్డం పెట్టారు. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్సులు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలి పేలుడు జరగ్గానే ప్రజలను చెదరగొట్టడానికి భద్రత సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తొలి పేలుడులో గాయపడిన వారిని హతమార్చడానికి మరోసారి పేలుడు జరిపినట్లు చెప్పారు. 



షియా- సున్నీ వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కాగా, అఫ్గాన్‌లో ఐసిస్ కన్నా బలమైన తాలిబన్.. ఈ దాడిలో తమ పాత్ర లేదని స్పష్టం చేసింది. ఐఎస్ కమాండర్ అబూ అలీ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని అఫ్గాన్ నిఘా వర్గం వెల్లడించింది. ఈ దాడిపై అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రపోరులో అఫ్గాన్‌కు భారత్ బాసటగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: