ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలు ఫలించే ఘడియ సమీపించింది. నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం తీపికబురును తీసుకొచ్చింది. భారీ సంఖ్యలో 593 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు త్వరలో జరుగనున్నాయి.  గతంలో మంజూరు చేసిన 439 పోస్టులకు మరో 593 పోస్టులను కలిపి గ్రూపు-2 కేటగిరిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వు (జీవో నెం.32) జారీ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,032కి చేరింది. ప్రత్యక్ష నియామకాల ద్వారా వెంటనే వీటిని భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించింది.

TSPSCLOGO


 కొత్తగా అనుమతించిన వాటిలో 259 డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులు ఉండడం విశేషం. కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యానే ఈ పోస్టులను భారీగా చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులన్నింటినీ నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేయాలని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి సూచించింది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి లోకల్‌ కేడర్‌, జిల్లా, జోన్ల వివరాలు, రోస్టర్‌ పాయింట్లు, అర్హతలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. అన్ని శాఖలు ఖాళీల వివరాలపై పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు ముందే సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు, ఇతర అంశాలను చేపట్టాలని సూచించింది.



రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో.. గ్రూప్ 2 పోస్టుల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఆర్థికశాఖ అనుమతుల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఖాళీలు ఉన్న ఆయా శాఖలు వాటి వివరాలను (ఇండెంట్) అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు వారం నుంచి పదిరోజుల సమయం పట్టవచ్చని తెలుస్తున్నది. అనంతరం ఈ వివరాలను టీఎస్‌పీఎస్సీ పరిశీలించి మరో వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల నుంచి నెల రోజుల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం పరీక్షకు సిద్ధం అయ్యేందుకు దాదాపు ఒక నెల వ్యవధిని ఇస్తారు. మొత్తంగా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకొని గ్రూప్ 2 పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహించవచ్చని టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.

TSPSCLOGOlist

మరింత సమాచారం తెలుసుకోండి: