కొమ్మినేని శ్రీనివాసరావు.. తెలుగు జర్నలిజంలో తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న జర్నలిస్టు.. తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని, చంద్రబాబు రాజకీయ ఎదుగుదలను దగ్గర నుంచి చూసిన జర్నలిస్టుల్లో ఆయన ఒకరు. ఆయన కొంతకాలంగా చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్నారు. తాజాగా సాక్షిలో చేరడంతో ఈ దూకుడు ఎక్కువైంది. 

తాజాగా ఆయన రాసిన ఓ వ్యాసంలో చంద్రబాబుకు అనేక ప్రశ్నలు, వ్యాఖ్యానాలు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనలోని గిల్టి కాన్సస్ ను తెలియచేస్తున్నాయని కొమ్మినేని అంటున్నారు. విదేశాలకు ఎక్కడికి వెళ్తే అమరావతిని ఆ నగరంగా మారుస్తానని అంటున్నారన్నారు. చంద్రబాబు విదేశీ మోజులో అమరావతిలో మురికివాడలు ఉండకూడదని అంటున్నారని..కానీ.. విజయవాడ రైల్వే లైన్ వెంట, కాల్వల వెంట ఒకసారి చంద్రబాబు పర్యటిస్తే ఎన్ని మురికి వాడలు ఉన్నాయో అర్ధం అవుతుందని రాశారు. 


మురికివాడలను జనావాసాలుగా, సదుపాయాలతో తీర్చిదిద్దాలి కాని, అక్కడ నివసించేవారిని అవమానించే రీతిలో సీఎం మాట్లాడకూడదని అన్నారు. చంద్రబాబు ఏదైనా ఒక భవనం కట్టి దానికి సిటీ అని పేరు పెడితే మొత్తం సిటీ అంతా తన ఖాతాలో వేసుకుంటారని కొమ్మినేని అంటున్నారు. సైబర్ టవర్స్ కట్టి హైటెక్ సిటీ అంతా తానేకట్టానంటారని.. రంగారెడ్డి జిల్లాలో కొంత బాగానికి సైబరాబాద్ అని పేరు పెట్టి.. దాన్నితానే నిర్మించానని చెప్పుకుంటారని కొమ్మినేని విమర్శిస్తున్నారు. 

చంద్రబాబు పదవి కోల్పోయిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గచ్చిబౌలి ప్రాంతంలో పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంతో అభివృద్ధి జరిగినా దాన్ని కాంగ్రెస్ వారు చెప్పుకోలేదని కొమ్మినేని కామెంట్ చేశారు. అమరావతి రాజధానిలో ఇరవైతొమ్మిది గ్రామాలు ఉన్నాయని.. వాటిని కదల్చకుండా ఆస్తానా వంటి నగరాలు ఎలా కడతారో చెప్పడంలేదన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: