హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాది బుర్హాన్‌ వనీని అమరవీరుడిగా పాక్‌ ప్రధాని షరీఫ్‌ పోల్చడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ మండిపడ్డారు. బుర్హాన్‌ను అమరవీరుడుతో పోల్చడం షరీఫ్‌కు తగదన్నారు. అతడు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ అని మీకు తెలియదా అని పాక్‌ ప్రధానిని సుష్మా నిలదీశారు. హఫీద్ సయీద్‌తోపాటు పలువురు ఉగ్రవాదులతో కలిసి పాకిస్థాన్ ప్రభుత్వం కశ్మీర్‌లో హింసను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నదని, దాంట్లోభాగంగానే ఉగ్రవాదులను కీర్తిస్తున్నదని దుయ్యబట్టారు.


కశ్మీరీ ప్రజలకు తన శుభాకాంక్షలు ఎల్లప్పుడూ ఉంటాయన్న షరీఫ్ వ్యాఖ్యకు స్పందిస్తూ.. మీరు కశ్మీర్‌కు శుభాకాంక్షలను కాదు.. ఆయుధాలను, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారు అని పేర్కొన్నారు. సొంతప్రజల మీదే దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ సైన్యంలాగా కాకుండా... భారత భద్రతదళాలు కశ్మీర్‌లో హింసాకాండను అరికట్టటంలో, ఆందోళనలను ఎదుర్కోవటంలో ఎంతో సంయమనంతో వ్యవహరించాయని సుష్మ తెలిపారు.



కశ్మీర్‌లో విధ్వంసాలకు పాకిస్థాన్‌ ఆజ్యం పోస్తోందని ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్‌ తమదవుతుందన్న షరీఫ్‌ వ్యాఖ్యలు ఎప్పటికీ నిజంకావని తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌లో కశ్మీర్‌ ఎప్పటికీ అంతర్భాగం కాజాలదన్నారు. కశ్మీర్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు, ఆయుధాలను మాత్రమే ఇచ్చింది తప్ప ఆశీర్వాదాలు కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: