‘కొత్త రాష్ట్రం.. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపట్టాం. వీటి అమలుకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా సాయం అందించండి’ అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు.  రాష్ట్ర పర్యటనకు వచ్చిన జైట్లీకి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం తన నివాసంలో విందు ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌, తెరాస ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, భాజపా శాసనసభపక్ష నేత లక్ష్మణ్‌, శాసనసభ్యులు రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చి ఆయనతో మాట్లాడారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.



రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్‌, ఇండసి్ట్రయల్‌ పాలసీ తదితర కార్యక్రమాలను జైట్లీకి సీఎం వివరించారు. ప్రతిష్ఠాత్మక పథకాలకు ప్రత్యేక సాయం అందించాలని కోరారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నాలుగేళ్ల వ్యవధిలో రూ.30,571 కోట్లు సాయం చేయాల్సిందిగా కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదన పెట్టిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖకు నీతీ ఆయోగ్‌ కూడా సిఫారసు చేసిన విషయాన్ని జైట్లీ దృష్టికి తెచ్చారు. వీటిపై వినతి పత్రాలనూ జైట్లీకి ఇచ్చారు. ప్రధాని మోదీ ఆగస్టు 7న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైట్లీకి సీఎం కేసీఆర్‌ వివరించారు.



రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు రూ.300 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గతంలో ఆదర్శ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చేదని, ఇప్పుడు వాటిని నిలిపివేయడంతో తామే భరిస్తున్నామని చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ద్వారా వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ, విద్యా సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులను కేంద్రం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్శిటీ ఏర్పాటు, పారిశ్రామిక రాయితీలుతదితర హామీలను నెరవేర్చాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: