ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మన్యంలో మావోయిస్టులు హల్‌చల్‌ సృష్టించారు. వెంకటాపురం మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన రహదారులు భవనాలశాఖ మార్గాన్ని శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దిగ్బంధించారు. కటాపురం మండలంలోని ఆలుబాక సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం రాత్రి అమర్చిన రెండు బకెట్‌ బాంబులను పోలీసులు ఆదివారం గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు 30 మందికి పైగా సాయుధ మావోయిస్టులు, 60 మందికి పైగా సానుభూతి పరులైన గొత్తికోయలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. 



ఈనెల 28 నుంచి ఆగస్టు 3వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జరిపేందుకు పిలుపునిచ్చిన భారత కమ్యూనిస్టుపార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్రకమిటీ దళసభ్యులు రభశా ప్రధానమార్గంపై అంకన్నగూడెం గుడిగుట్ట ప్రాంతంలో రహదారికి ఇరువైపులా అడ్డంగా తాళ్లను కట్టారు. ఆప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని రాకపోకలను నిలిపివేసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆర్టీసీ బస్సులను వెనక్కి తిరిగి వెళ్లాల్సిందిగా సూచించిన మావోయిస్టులు ప్రైవేటు వాహనాలు నిలిపివేశారు. 

‘బకెట్‌’ భయం


ఇదే సమయంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవటంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌– ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజానీకం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారోత్సవాల వేళ అటవీ ప్రాంతాల నుంచి మావోయిస్టులు గ్రామాలకు దూసుకొస్తుండగా..వారిని తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతి దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజానీకం ఆందోళన చెందుతోంది.



మావోయిస్టులు బకెట్‌ బాంబులు పెట్టడం వెనుక భారీ విధ్వంసానికే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. కూంబింగ్‌కు వచ్చే పోలీసులను టార్గెట్‌ చేసుకొని మావోయిస్టులు బకెట్‌ బాంబులు పెడుతున్నట్టు సమాచారం. వెంకటాపురం మండలం ఆలుబాక సమీపంలోని ప్రధాన రహదారిపై బకెట్‌ బాంబులు బయటపడటం ఇదే తొలిసారి. వీటిని నిర్వీర్యం చేసుందుకు పోలీసు బలగాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వకుండా.. చివరకు మీడియాకూ తెలియకుండా బాంబులను నిర్వీర్యం చేశారు. ఇవి శక్తివంతమైన బాంబులు కావడంతో పోలీసులు అతి జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: