హైదరాబాద్‌ ఫిలింనగర్‌ ప్రాంతం.. ఆదివారం ఉదయం ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో హఠాత్తుగా కుదుపుతోపాటు భయంకరమైన శబ్దం. ఏం జరిగిందో గ్రహించేలోపే నిర్మాణం కుప్పకూలింది. ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందా రు. ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ (ఎఫ్‌.ఎన్‌.సి.సి) విస్తరణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది.



సినీ, రాజకీయ ప్రముఖులతో సందడిగా ఉండే ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లోని గేట్‌-1 నుంచి లోపలికి ప్రవేశించే మార్గంలో వర్షానికి తడవకుండా గతంలో పోర్టికో నిర్మించారు. అది సరిగా లేకపోవడంతో భవనం నుంచి గేటు వరకు కప్పుతూ పోర్టికోను విస్తరిస్తున్నారు. పాత పోర్టికో మీదనే శ్లాబు నిర్మాణ పనులు ప్రారంభించారు. గేట్‌ ముందు శనివారం రాత్రి 11 గంటల నుంచి పనులు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 11.45 గంటల ప్రాంతంలో పోర్టికో కదలడం ప్రారంభించింది. కార్మికులు తేరుకునేలోగానే ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పశ్చిమ్‌బంగకు చెందిన మాన్సూన్‌ షేక్‌ (35), కర్ణాటకకు చెందిన ఆనంద్‌ (35) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్‌, కోటేశ్వర్‌రావు (ఆంధ్రప్రదేశ్‌), మెనప్ప శివ, కొండి మల్లేశం, తిప్పన వీరప్ప, సీతారాం (కర్ణాటక), సాహెబ్‌ మండల్‌, అజిత్‌ బిశ్వాస్‌ (పశ్చిమ్‌బంగ) గాయపడ్డారు.



కాగా, ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, పోలీసు, అగ్నిమాపక శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెంటనే సమీపంలోని ఆపోలో దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదానికి కారణమైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. 



సరైన భద్రతా ఏర్పాట్లు, ఇంజనీరింగ్‌ నిర్లక్ష్యం కారణంగానే నిర్మాణం కుప్పకూలినట్లు జీహెచ్‌ఎంసీ అధికారు లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఇంత పెద్దనిర్మాణానికి సపోర్ట్‌గా బలహీనమైన ఏర్పాట్లు చేశారు. సిమెంట్‌ పైపుల్లో ఇసుక నింపి నామమాత్రంగా ఉంచారు. ప్రధా న గేటు వద్ద మాత్రం రెండు మూలల రెండేసి పిల్లర్లను ఏర్పాటు చేశారు. సామర్థ్యాన్ని మించిన బరువు పడటంతో సపోర్ట్‌గా ఉంచిన తాత్కాలిక ఫిల్లర్లు కుప్పకూలినట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నాసిరకం సామాగ్రి ఉపయోగించి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తంచేశారు. వాటి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: