చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ)లో చేరకుండా భారత్‌ను చైనా అడ్డుకున్నందుకు భారత్‌ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని చైనా ఆరోపిస్తోంది.



చైనా అధికారిక మీడియా జినువా న్యూస్‌ ఏజెన్సీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు భారత్‌లో ఉండడానికి వీసా పొడిగింపును ప్రభుత్వం నిరాకరించింది. దిల్లీలో బ్యూరో చీఫ్‌ వు కియాంగ్‌, ముంబయిలోని రిపోర్టర్లు తాంగు లు, మా కియాంగ్‌ల వీసా గడువు జనవరిలో ముగియగా పొడిగిస్తూ వస్తున్నారు.  వీసాల విషయంలో భారత్ చర్యలకు తమ ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయని, కొందరు భారతీయులకు వీసాలు దొరకడం ఇక కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది.



జులై 31న పొడిగించిన గడువు కూడా ముగుస్తుండగా.. మళ్లీ పొడిగింపు కోరారు. వారి స్థానంలో వేరే విలేకరులు వచ్చేవరకు కొన్ని నెలల పాటు పొడిగించాలని అడిగారు. భారత అధికారులు ఇందుకు అంగీకరించలేదు. వీరు తమ వృత్తి పరిధి దాటి ఇతర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న అనుమానంతో వీరిపై భద్రతాసిబ్బంది నిఘా పెట్టినట్లు సమాచారం. కానీ భారత అధికారులు మాత్రం అధికారికంగా వీరి వీసా నిరాకరించడానికి కారణాలు వెల్లడించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: