26 ఏళ్ల నర్సింగ్‌ యాదవ్‌.. భారత్ పతక అంచనాలను పెంచిన రెజ్లర్‌. పాల వ్యాపారి కుమారుడైన నర్సింగ్‌.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 74 కిలోల విభాగంలో రియో అర్హత సాధించిన రెజ్లర్‌ యాదవ్‌ డోపింగ్‌లో దొరికిపోవడం పెద్దషాక్‌..! అతడు నిషేధిత ఉత్ర్పేరకం మిథన్‌డైనోన్‌ను ఉపయోగించినట్టు ‘బి’ శాంపిల్‌ పరీక్షలో కూడా తేలింది. దీంతో నర్సింగ్‌ ఒలింపిక్స్‌ ఆశలు అడియాశలయ్యే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.
ర్సింగ్‌ డోపింగ్‌లో దొరకడంతో అతడిపై నిషేధం వేటుపడే అవకాశాలున్నాయి. దీంతో అందరూ వేసే ప్రశ్న సుశీల్‌ కుమార్‌కు అవకాశం దక్కుతుందా? అని. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రెజ్లింగ్‌ రియో బృందంలో మార్పులు చేర్పులూ చేయడానికి ఈ నెల 18 చివరి తేదీ. గాయపడిన అథ్లెట్లను భర్తీ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. దీంతో సుశీల్‌కు రియో చాన్స్‌లు లేవని భారత ఒలింపిక్‌ సంఘం సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా చెప్పాడు. దీంతో 74 కిలోల విభాగంలో భారత బరిలో నిలిచే అవకాశాలు కనిపించడం లేదు.



ఒలింపిక్స్‌ను పురస్కరించుకుని తన ప్రమేయం లేకుండా వార్తల్లోకి ఎక్కిన ఆటగాడు నర్సింగ్‌. గత ఏడాది అమెరికాలో జరిగిన ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో 74 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో కాంస్యం నెగ్గడం ద్వారా అతడు దేశానికి రియో బెర్త్‌ సాధించిపెట్టాడు. అయితే అదే విభాగంలో రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించిన సుశీల్‌ కుమార్‌ కూడా బరిలో ఉండడంతో రియోకు ఎవరిని పంపాలనే దానిపై రచ్చ జరిగి కోర్టుల వరకూ వెళ్లింది. 66 కిలోల విభాగంలో సుశీల్‌ పోటీపడేవాడు. కానీ రియోలో ఆ కేటగిరీ ఎత్తివేయడంతో కుమార్‌ 74 కిలోలకు మారాల్సి వచ్చింది. విభాగం మారిన తర్వాత సుశీల్‌ గాయపడి, వరల్డ్‌ చాంపియన్స్‌లో కూడా పాల్గొనలేక పోయాడు. అయితే భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ (డబ్ల్యూఎఫ్‌ఐ) ట్రయల్స్‌ నిర్వహించి రియో బెర్త్‌లు ఖరారు చేస్తుందనే ఆశతో ఎదురుచూశాడు. 



జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంఘం (నాడా) నిర్వహించిన పరీక్షలో విఫలమైన రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) బాసటగా నిలిచింది. అతడిపై కుట్ర జరిగి ఉంటుందని సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ అన్నారు. ‘నర్సింగ్‌ అమాయకుడు. అతడికి అన్యాయం జరిగింది. త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ సమస్య నుంచి అతడిని సురక్షితంగా తప్పించేందుకు చేయాల్సిందంతా చేస్తాం. ఒలింపిక్స్‌లో 74 కిలోల విభాగంలో నర్సింగ్‌ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. సమాఖ్య అతడికి బాసటగా నిలిస్తుందని’ బ్రిజ్‌ భూషణ్‌ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: