ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతై మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు.. అందులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ఎక్కడున్నారో తెలియక ఆ కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. వారిలో 8 మంది వరకూ విశాఖవాసులే. దీంతో విశాఖలో గంభీరమైన వాతారవణం నెలకొంది. 

విమాన గల్లంతు బాధిత కుటుంబాలను ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ పరామర్సించారు. బాధిత కుటుంబాలను జగన్ ఓదార్చారు. ఈ సమయంలో జగన్ ఒకసారి గతం గుర్తుకు తెచ్చుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ గల్లంతైన దుర్ఘటన రోజులను తలచుకున్నారు. 


ఆ సమయంలో తాను పడిన వేదనను బాధితులతో పంచుకున్నారు. తన తండ్రి హెలికాఫ్టర్ గల్లంతు అయినప్పుడు తాము కూడా తీవ్ర టెన్షన్ కు గురయ్యామని వారితో చెప్పారు. ఆప్తులు గల్లంతైతే కలిగే బాధ, కష్టం తనకు తెలుసని వారితో చెప్పారు. విమానంలో వెళ్లిన వారు క్షేమంగా ఉండి ఉంటారని ఆశిద్దామని.. త్వరలోనే ఆ విమానం ఆచూకి తెలియాలని ఆకాంక్షించారు. 

ఎందరు నేతలు వచ్చి ఓదార్చినా.. బాధిత కుటుంబాల శోకం తీరనిదే. అయినవారు కనీసం బతికున్నారో లేదో కూడా తెలియని సందిగ్దత వారిని కుంగీతీస్తోంది. ఏ నిమిషంలో ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: