మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ, సీపీఎంల కుట్రలే కారణమని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు సాగునీరందితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. సోమవారమిక్కడ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో హరీశ్ మాట్లాడారు. సంగారెడ్డి, హైదరాబాద్  తదితర బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే రైతులను రెచ్చగొట్టారని, పోలీసులపై, రైతులపై రాళ్లు రువ్వారని అన్నారు.



మల్లన్నసాగర్‌ కింద రైతులేమైనా ముఖ్యమంత్రి పదవి అడిగారా? తీసుకొంటున్న భూమికి న్యాయమైన పరిహారం అడిగితే వీపులు పగలగొట్టిస్తారా? సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్ధితి ఉంటే ఇక రాష్ట్రంలో పాలన గురించి ఏమనుకోవాలి? రాజకీయం ఎవరు చేస్తున్నారో తేలుద్దామా? కేసీఆర్‌ తన భూములను ఎకరా రూ.10 లక్షలు చొప్పున అమ్ముతారా? అని సర్కారుపై టీటీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులపై హరీష్ రావు పై విధంగా స్పందించారు. 



మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది గ్రామాలకుగాను ఆరు గ్రామాల రైతులు భూములివ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ప్రతిపక్షాలు ఇటీవల ఏ టెంట్ కింద దీక్షలు చేశాయో, అదే టెంట్ కింద రైతులు భూములిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వివరించారు. మిగిలిన రెండు గ్రామాల్లో కూడా ఒకట్రెండు రోజుల్లో భూసేకరణ సమస్య పరిష్కారమైతే తమ పని అయిపోయినట్లేనని భావించిన టీడీపీ, సీపీఎం నేతలు రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటలకు కుట్రపన్నారన్నారు.



హింసాత్మక ఘటనలను చోటు చేసుకోవడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సోమవారం తలపెట్టిన బంద్  విఫలమైందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని విపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నాయని మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: