యాహూ ఆపరేటింగ్‌ వ్యాపారాన్ని 483 కోట్ల డాలర్లకు (దాదాపు 33 వేల కోట్ల రూపాయలు) కొనుగోలు చేసినట్లు వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. తొలి తరం వెబ్‌ యూజర్లలో యాహూ కు అనూహ్యమైన క్రేజ్‌ ఉండేది. ఇకపై యాహూ వ్యవహారాలను వెరిజాన్‌లో ప్రెసిడెంట్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న మర్ని వాల్డిన్‌ పర్యవేక్షిస్తారు. ఇటీవలే కొనుగోలు చేసిన ఎఔల్‌లో యాహూను విలీనం చేస్తామని వెరిజాన్‌ తెలిపింది. 2008లో యాహూను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపింది. అందుకు ప్రతిఫలంగా 44 బిలియన్‌ డాలర్లు (రూ.1.76 లక్షల కోట్లు- డాలర్‌ మారకం విలువ రూ.40) ఇవ్వజూపింది. దాన్ని యాహూ డైరెక్టర్ల బోర్డు తిరస్కరించింది. కానీ ఇప్పుడు యాహూ విలువ అందులో పదో వంతే.



మొదటిసారి ఇంటర్నెట్‌ వినియోగించే వారికి ఎంతో చిరపరిచితమైన పేరు యాహూ. ఇమెయిల్‌ సేవలు హాట్‌మెయిల్‌తో ప్రారంభం అయితే, దాన్ని మించి ఆదరణ పొందిన సంస్థ యాహూ. అందుకే తొలితరం ఇమెయిల్‌ వినియోగదార్లలో ఎక్కువ మంది ఐడీలు యాహూతోనే ఉంటాయి. దశాబ్దకాలం క్రితం ఇంటర్నెట్‌ను ఈ సంస్థ శాసించింది. కానీ ఆతర్వాత శరవేగంగా వచ్చిన సాంకేతిక మార్పులకు, ఎదురైన సవాళ్లకు సన్నద్ధం కాలేకపోయింది. అదే యాహూ ఇబ్బందులకు, విలువ తగ్గిపోవటానికి ప్రధాన కారణమైంది.



యాహూ వద్ద ఉన్న నికర నిల్వలు, యాహూకు ఆలిబాబా గ్రూప్‌ హోల్డింగ్స్‌లో ఉన్న షేర్లు, యాహూ జపాన్‌ షేర్లు, యాహూ కన్వర్టబుల్‌ నోట్లు, యాహూ నాన్‌కోర్‌ పేటెంట్లు తాజా కొనుగోలు కిందకురావని వెరిజాన్‌ తెలిపింది. ఈ ఆస్తులన్నీ ఇకపై కూడా యాహూ నిర్వహణలోనే కొనసాగుతాయి. అయితే డీల్‌ అనంతరం యాహూ బ్రాండ్‌ వెరిజాన్‌కు బదిలీ అవుతున్నందున కొత్త పేరుతో యాహూ రిజిస్టరై ఈ ఆస్తుల నిర్వహణ చూసుకోనుంది. తాజా ఒప్పందానికి యాహూ షేర్‌ హోల్డర్లు, నియంత్రణ పరమైన అనుమతులు రావాల్సి ఉంది. ఈ డీల్‌ 2017 తొలి త్రైమాసికానికి ముగియవచ్చని అంచనా. అప్పటివరకు యాహూ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. 



డాట్‌కామ్‌ బూమ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో యాహూ విలువ పది వేల కోట్ల డాలర్లని లెక్కించారు. అనంతరం 2008 సమయంలో యాహూను 4,400 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఈ లెక్కన చూస్తే తాజా డీల్‌ లేశమాత్రమని చెప్పవచ్చు. కస్టమర్లు పుష్కలంగా ఉన్నా, వారిని మానిటైజ్‌ (ద్రవ్యీకరణ) చేసుకోవడంలో విఫలం కావడమే యాహూ పతనానికి కారణమని చెప్పవచ్చు. త్వరలో తనవద్ద ఉన్న 3,000 పేటెంట్లను వంద కోట్ల డాలర్లకు విక్రయించాలని యాహూ భావిస్తోంది. ఈ పరిణామాలతో క్రమంగా యాహూ బ్రాండ్‌ కనుమరుగుకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: