బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పి పబ్బంగడుపుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఉస్మానియా ఆస్పత్రిలో వారం రోజులు కూర్చుంటే రోగుల సమస్యలు, దుర్భర పరిస్థితులు తెలుస్తాయని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, కార్పొరేటర్‌ జి.శంకర్‌యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు మెట్టు వైకుంఠం, వై.కృష్ణ, కన్వీనర్‌ శ్రీరాంవ్యాస్‌, మహేందర్‌వ్యాస్‌తో కలిసి సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. 



సీఎం కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం... అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌స్థాయిలో నిర్వహిస్తామని మాటలగారడీతో పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఉస్మాని యా ఆస్పత్రిని వెంటనే సందర్శించి ఇక్కడే కూర్చుంటే సమస్యలు తెలుస్తాయని కిషనరెడ్డి సూచించారు.



నాలుగు నెలలుగా జీతాలు లేవు...ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అందుతు న్న మౌలిక వసతులు, సేవలను అడిగి తెలుసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని పారిశుధ్య కార్మికులు కలిసి తమ గోడు వెల్లబోసుకు న్నారు. నాలుగు నెలలుగా గత పారిశుధ్య కాం ట్రాక్టర్‌ జీతాలు చెల్లించలేదని, దీనివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని తెలి పారు. బకాయి జీతాలను వెంటనే చెల్లించేందు కు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవీఎస్‌మూర్తితో మాట్లాడుతానని కిషన్‌రెడ్డి తెలిపారు.



ఉదయం 11.15 గంటలకు ఆస్పత్రి ప్రవేశద్వారం చేరుకున్న కిషన్‌రెడ్డికి.. చెట్టుకింద ఫుట్‌పాత్‌పై నిస్సహాయ స్థితిలో ఉన్న చంపాపేట్‌ ప్రాంతానికి చెందిన శకుంతల దర్శనమిచ్చింది. ఏమయిందంటూ మొదట ఆమెను పలకరించారు. ఆమె కూతురు లావణ్య తమ తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, నడవలేని స్థితిలో ఉందని వీల్‌చైర్‌ద్వారా వైద్యుడివద్దకు తీసుకెళదామంటే సెల్‌ఫోన్‌లేనిదే వీల్‌చైర్‌ ఇవ్వలేమని మొండికేశారు. తనవద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో చేసేది లేక ఇక్కడే ఎదురుచూస్తున్నామని బోరున రోదిస్తూ కిషన్‌రెడ్డికి విన్నవించింది. దీంతో కిషన్‌రెడ్డి వెంటనే స్పందించి ఆస్పత్రిలో ఇంత దయనీయస్థితి ఉందా...? సెల్‌ఫోన్‌ లేనిదే రోగులకు వీల్‌చైర్‌ ఇవ్వరా..? అంటూ డ్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ అంజయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీల్‌చైర్‌ తెప్పించి ఆమెకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఆస్పత్రిలోకి పంపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: