ముందుగా అంతా ఊహించినట్టే తెలంగాణ మెడికల్ పేపర్ లీకైనట్టు తేలింది. ఈ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం గుట్టు తేల్చేందుకు సీఐడీ పోలీసులు రెడీ అవుతున్నారు. ప్రాథమిక పరిశీలనలో గుర్తించిన సమాచారం ఆధారంగా సీఐడీ అధికారులు ఐపీసీ 406, 408, 420 రెడ్ విత్ 120బి తో పాటు మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద నిందితులు గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశారు.

కింది స్థాయి ఉద్యోగి ప్రమేయంతోనే ఈ పేపర్ లీకేజీ బాగోతానికి తెర లేచిందట. ఇందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభ్యమయ్యాయట. ప్రశ్నపత్రం ముద్రించిన డిల్లీ నుంచే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నలు బయటకు వచ్చినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి ఢిల్లీకి వెళ్లి విచారణ జరిపారు. మొత్తం ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా.. లేక కొన్ని ప్రశ్నలు బహిర్గతమయ్యాయా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


ఎంసెట్ అక్రమాల వ్యవహారంలో వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కుమార్, దయాకర్  కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ భావిస్తోంది. ఒకరి కూతురికి వంద లోపు, మరొకరి బంధువుకు మూడు వందల్లోపు ర్యాంకులు వచ్చాయి. వారిద్దరికి మొదటి ఎంసెట్ లో వేలల్లో ర్యాంకులు వచ్చాయి. విష్ణు అనే కన్సల్టెంట్  వీరిద్దరి ద్వారా ప్రశ్నలు సేకరించి మరో ముగ్గురు విద్యార్థులకు చేరవేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఏజెంట్లు ఎంసెట్ ప్రశ్నపత్రానికి సంబంధించిన కొందరు అధికారులతో కూడా మాట్లాడినట్లు ఫోన్ కాల్స్ విశ్లేషణలో తేలిందట. అనుమానిత అయిదుగురు విద్యార్థుల ఫోన్ కాల్స్ సిగ్నల్స్ ఆధారంగా వారు పరీక్షకు ముందు అయిదారు రోజులు హైదరాబాద్ శివారుల్లో ఉన్నట్టు గుర్తించారట. శంకర్ పల్లిలో ఉన్నట్లు సీఐడీ గుర్తించిందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: