రాజీవ్ గాంధీ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు మరోసారి అడుగు ముందుకేసింది. కేంద్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయమన్న సుప్రీం కోర్టు గత తీర్పును  సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ తీర్పు రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది. 

రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న మురుగన్, శాంతన్, పేరరివాలన్ నళిని, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవి చంద్రన్ లను తన అధికారాన్ని ఉపయోగించి 2014 లో విడుదల చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో తన నిర్ణయాన్ని తెలపాలంటూ కేంద్రాన్ని కోరింది. అయితే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దావా వేసింది. 


ఈ దావాను సుప్రీం కోర్టుకు చెందిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. సీబీఐ వంటి కేంద్రీయ విచారణ సంస్థలు  రాజీవ్ హత్య కేసును విచారించాయని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. కేంద్రీయ విచారణ సంస్థలు విచారించిన కేసులో నేర నిరూపితమైన వారిని రాష్ట్రం విడుదల చెయ్య జాలదని సుప్రీం కోర్టు 2015 డిసెంబరు నాటి తన తీర్పులో స్పష్టం చేసింది. 

ఐతే సుప్రీం కోర్టు తీర్పును పున సమీక్షించాల్సిందిగా  తాజాగా తమిళనాడు సుప్రీం కోర్టులో తన పిటిషన్లో పేర్కొంది. గత పాతికేళ్లుగా తమిళనాడులోని జైళ్లలో మగ్గుతోన్న రాజీవ్ హంతకులను విడుదల చేసే విషయంలో కేంద్ర సూచనలను  మాత్రమే తమిళనాడు ప్రభుత్వం కోరిందని తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ఆమోదం అవసరం లేదని తెలిపింది. గత సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రాలకున్న అధికారాలకు ప్రతిబంధకంగా పరిణమిస్తాయని తమిళనాడు ప్రభుత్వం అభిప్రాయ పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: