బాబు రావాలి.. జాబు రావాలి.. ఇది ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన నినాదం.. కానీ దీనికి అధికారంలోకి వచ్చాక వేరే అర్థం చెప్పింది ఆ పార్టీ మొదట్లో.. ఇస్తామన్నది ఉద్యోగాలే కానీ గవర్నమెంటువి కావు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ బాబు ఎంత ఇద్దామనుకున్నా.. వద్దనుకున్నా.. తప్పనిసరి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి కదా..

ఇప్పుడు వాటి భర్తీపై దృష్టి సారించారు. మొన్న టీచర్ పోస్టులు, నిన్న పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పుడు యూనివర్శిటీల్లో అధ్యాపకుల పోస్టులు.. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి సమ్మతి తెలుపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 


ఈ అధ్యాపక పోస్టుల భర్తీ రెండు దశల్లో ఉంటుందట. గతంలో అధ్యాపక పోస్టుల భర్తీలో ఉపకులపతులు, పాలకవర్గాల ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈసారి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ఏపీపీఎస్సీకి అప్పగించారు. ఇప్పుడు ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. భర్తీ నియమ నిబంధనలు త్వరలో జారీ అయ్యే అవకాశం ఉంది. 

తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1,385 అధ్యాపక ఉద్యోగాలున్నాయి. ఈ ఏడాది 1,104 ఉద్యోగాలను, వచ్చే ఏడాది మిగిలిన 281 ఉద్యోగాలను భర్తీకి నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 14 విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ చేస్తారు. 

అత్యధికంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 276 పోస్టులు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం - 151, జేఎన్టీయూ అనంతపురం-113, నాగార్జున విశ్వవిద్యాలయం-105, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం- 95 ఉన్నాయి. ఆగస్టులో ఉద్యోగ ప్రకటన వచ్చే ఛాన్సుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: