ఏపీకి ప్రత్యేక హోదా పై ఎక్కడ చర్చ వచ్చినా ఆయన పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది.. ఆయన పార్లమెంట్ లో చేసిన డిమాండ్ ను తప్పకుండా గుర్తు చేస్తారు.. ఆయనే వెంకయ్యనాయుడు.. మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చినప్పుడు.. ఐదేళ్లు కాదు.. పదేళ్లు అంటూ డిమాండ్ చేసిన వ్యక్తి వెంకయ్య నాయుడు..

ఇప్పుడు ప్రత్యేక హోదా మృగ్యమవుతున్న సమయంలో వెంకయ్య విమర్శలపాలవుతున్నారు. అప్పుడంతగా ఎగిరిపడ్డారే..అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందా ఇంకా హోదా ఊసెత్తరే అని వెంకయ్యను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదాపై స్వల్పకాలికంగా చర్చ జరిగింది. ఇందులో ప్రసంగించిన వెంకయ్య విశ్వరూపం చూపించారు. 


ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయం ఏమైందని గౌరవ సభ్యులు ప్రశ్నించడం మంచిదే. రాష్ట్ర విభజనకు సీపీఎం తప్ప ఆనాడు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. విభజనతో ఏపీ ప్రజలు ఇబ్బంది పడతారనే ఆనాడు నేను జోక్యం చేసుకున్నా.. కొన్ని అంశాలను విభజన చట్టంలో చేర్చలేదు..

ప్రత్యేక హోదాపై తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వస్తున్నాయి. ఏడు మండలాలను విలీనం చేయకపోతే పోలవరం సాధ్యంకాదని ఆర్డినెన్స్‌ జారీ చేశాం. ఏపీకి ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీ సహా పలు విద్యా సంస్థలను మంజూరు చేశాం. విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను విస్తరించాం. పోలవరం ప్రాజెక్టుకు రెండేళ్లు నిధులు ఇచ్చాం. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సోలార్‌ పవర్‌ పార్కులు మంజూరుచేశాం. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఎక్సైజ్‌ అండ్‌ నార్కోటిక్స్‌ మంజూరు చేశాం. ఏపీకి 1.93లక్షల ఇళ్లు మంజూరుచేశాం.  

ప్రత్యేక హోదా కూడా ప్రధానమైనదే. మరి ఆ అంశాన్ని చట్టంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు. ఆంధ్రప్రదేశ్‌ కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని పనులన్నీ చేస్తున్నాం. విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేస్తాం అని వెంకయ్య తన సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: