ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజా, ప్రభుత్వ సొమ్మును అనధికారికంగా దోచుకొని వాటికి ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించకుండా ప్రభుత్వ కళ్ళు గప్పి కొల్లగొట్టిన సొమ్మును ఎక్కడ దాచుకుంటారు అని ప్రశ్నించుకుంటే వెంటనే వచ్చే సమాధానం స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంకులో అనే విషయం చిన్న పిల్లవాడిని సైతం అడిగినా టక్కున చెప్పేస్తాడు. అయితే ఇటీవల భారత్ సహా పలుదేశాలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును బయటకు తెప్పిస్తామని, ప్రభుత్వం ఆ సొమ్మును ప్రజలకోసం ఖర్చుపెడుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పైగా స్విస్ బ్యాంక్ కూడా పన్ను శాతాన్ని పెంచిన కారణంగా నల్ల కుబెరులంతా తమ రూటు మారుస్తున్నారట. 



ఎప్పుడు తన డబ్బు బయటపడుతుందేమో అన్న భయంతో స్విస్ బ్యాంక్ కు టాటా చెప్పి ఇతర బ్యాంకుల వైపు చూస్తున్నారు. సొమ్ములు దాచుకునేవారికి ఒకప్పుడు స్విట్జర్లాండ్‌ స్వర్గంతో సమానం. కానీ అక్కడ పన్ను చెల్లింపు అంశాన్ని పారదర్శకంగా చేయడంతో ఇప్పుడు భారతీయ బిలియనీర్లు ఇతర దేశాలవైపు చూస్తున్నారని ప్రముఖ వ్యాపారవేత్త, జెనీవాలోని హిందుజా బ్యాంక్‌లో వాటాదారైన గోపీచంద్‌ హిందుజా అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని కుబేరులంతా దుబాయ్‌, కతార్‌, సింగపూర్‌ వంటి ప్రాంతాల్లో తమ సొమ్ములు దాచుకుంటున్నారని ఆయన చెప్పారు. దీంతో స్విట్జర్లాండ్‌ ప్రభ కొద్దికొద్దిగా తగ్గుతోందని అన్నారు. భవిష్యత్తులో డబ్బు డిపాజిట్లలో తన పేరు నిలబెట్టుకోవడానికి కూడా ఇక ఆ దేశం ప్రయత్నించకపోవచ్చని పేర్కొన్నారు.



అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల నుంచి వస్తున్న దర్యాప్తులు, కొత్త విధానంలో వివిధ ప్రభుత్వాలతో కుదిరిన బ్యాంకు సమాచారం మార్పిడి ఒప్పందాలతో ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చింది. గతంలో ఎటువంటి ప్రశ్నలు అడగకుండా సంపదను భద్రపర్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు స్విస్‌ ఫ్రాంక్‌ మారకం విలువ బలంగా ఉండటం లాభదాయకతపై ప్రభావం చూపుతోంది. తక్కువ వడ్డీ రేట్లు, కఠినమైన నిబంధనలతో ఇక్కడ డిపాజిట్‌ చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: