భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వచ్చే నెల 15న ఢిల్లీలోని ఎర్రకోటపై దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉందట. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఉగ్రవాద నిర్మూలన దళాలను అప్రమత్తం చేశాయి. ఎర్రకోటపై ప్రధాని మాట్లాడే సమయంలో కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం.



ప్రమాద సూచికలు బలంగా ఉండటం వల్ల ప్రధాని కచ్చితంగా  బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించాలని భద్రతా అధికారులు కోరారు. ప్రధానిమంత్రిగా పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించకుండా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. కేవలం కశ్మీర్ కల్లోలం, బోర్డర్లలో చొరబాటుదారులు పెరుగుతుండటమే కాకుండా ప్రధానిని టార్గెట్ చేసేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.



మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం ఎర్రకోట నుంచి ప్రసంగించే ప్రధానుల కోసం భద్రతా దళాలు బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగిస్తున్నాయి. అయితే ప్రధానిగా ఎర్రకోట నుంచి తొలి ప్రసంగం చేసిన మోదీ... చివరి నిమిషంలో బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను తిరస్కరించారు. గతేడాది కూడా ఆయన ఇలాగే బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండానే ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఈ ఏడాది కూడా ప్రధాని అదే తరహా నిర్ణయం తీసుకుంటారేమోనన్న ఆందోళనతో కేంద్ర నిఘా వర్గాలు ఎస్పీజీని అప్రమత్తం చేశాయి. ప్రధానిని టార్గెట్ చేస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు ఆల్ కాయిదా, లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హిర్కతుల్ జిహాదీ ఇస్లామీ తదితర సంస్థలు క్షిపణులతో విరుచుకుపడేందుకు పన్నాగం పన్నుతున్నాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది.  ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ దఫా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ నుంచే ప్రసంగించేలా చర్చలు తీసుకోవాలని కూడా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సూచించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: