ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు. పార్టీ కీలయ వ్యవహారాలన్నింటినీ భుజాన వేసుకొని సావధానంగా పరిష్కరించే నేత. పార్టీ స్థితి గతులపై సమగ్రమైన అవగాహన ఉన్న నేత. పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేనున్నానంటూ పార్టీకి, బాబుకు అండగా నిలబడిన నేత. పార్టీ భారాన్ని ఇన్నాళ్లు తన భుజాన వేసుకున్న నేత ఇప్పుడు పార్టీ భారాన్ని మోయలేనని తెగేసి చెబుతున్నాడు. ఇంతకీ ఎవరా నేత అని ఆలోచిస్తున్నారా...? ఇంకెవరు ఆయనే ఎల్. రమణ. 



ఆయన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధినేత భారాన్ని మోయలేని బరువుగా భావిస్తున్నారట. పార్టీ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించి జాతీయ స్థాయిలో పార్టీ హోదాని కట్టబెట్టాలని బాబుకు మొర పెట్టుకుంటున్నారట. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ టీడీపీ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రమణ సొంతజిల్లా కరీంనగర్. బీసీ నేతగా రాజకీయాల్లో ఎదిగి అనతికాలంలోనే పార్టీ పగ్గాలు చేపట్టగలిగారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో సైతం టీడీపీకి ఆయనే పెద్ద దిక్కు. జగిత్యాల రాజకీయాలలో ఇద్దరు నేతలు బాగా పాపులర్‌. 



ఒకరు ఎల్‌. రమణ కాగా, మరొకరు సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి. ఒక్కో దఫా ఒక్కొక్కరిని నియోజకవర్గ ఓటర్లు తమ ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటుంటారు. ఒకసారి జీవన్‌రెడ్డికి ఆ అవకాశం వస్తే మరోసారి రమణని అవకాశం వరిస్తుందన్న మాట! కిందటి ఎన్నికల్లో రమణ ఓడిపోయి జీవన్‌రెడ్డి గెలిచారు. అంటే- ఆనవాయితీ ప్రకారం నెస్ట్ ఎలక్షన్స్‌లో రమణకి ఛాన్స్ ఉండొచ్చన్న మాట! అయితే చరిత్ర పునరావృతం కాకపోవచ్చు అంటున్నారట ఎల్‌. రమణ. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ రమణ తీసుకున్న నిర్ణయంపై జిల్లా రాజకీయ వర్గాలలో వాడివేడి చర్చ జరుగుతోందట.



 దీనికి తోడు ఇటీవల టీఆర్ఎస్ నుంచి వచ్చిన బంపరాఫర్‌ని రమణ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారట. ఆ ఆఫర్‌కే గనుక ఓకే చెబితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరుగుండదట! కానీ కన్నతల్లిలాంటి టీడీపీని వీడేందుకు మనసొప్పక ఆ ఆఫర్‌ని రమణ తోసిపుచ్చారట. అందుకే అటు పార్టీని వదులుకోలేక, ఇటు ఎన్నికల రంగంలో కొనసాగలేక సతమతమవుతున్నారట. ఉండబట్టలేక తన మనసులో మాటని పార్టీ అధినేత చంద్రబాబు చెవిన వేశారట. వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోనని అన్నారట. అందుచేత తనకు రాజ్యసభ సీటు లేదా మరేదైనా నామినేటెడ్ పదవి అప్పగించి ఢిల్లీకి పంపాలని విన్నవించుకున్నారట. ప్రస్తుతం ఈ అంశాన్ని చంద్రబాబు హోల్డ్‌లో పెట్టారట...!


మరింత సమాచారం తెలుసుకోండి: