తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. గత  ఏడాది 700 కోట్లు.. మొత్తంగా  2 వేల కోట్లు నష్టాలను చవి చూసింది. అందుకే అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు కొత్త కొత్త ఐడియాలు వర్కవుట్ చేస్తోంది. వాటలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మినీ బస్సులు ప్రవేశపెడతారట.  

మినీ బస్సుల ద్వారా నష్టాల్లో ఉన్న సంస్థను కొంత మేర గట్టెక్కించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. అందుకే ముందుగా ఎంపిక చేసిన 136 రూట్లలో ఈ మినీ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు సైతం ఈ బస్సులను నడపాలని  నిర్ణయించింది.


ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఆర్టీసీ సమీక్షలో కూడా మినీ బస్సులను ప్రయోగాత్మకంగా నడపాలన్న నిర్ణయం జరిగింది. ఈమేరకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఈ అంశంపై ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యార్థులు ఎక్కువగా తిరిగే రూట్లలో కాకుండా సామాన్య ప్రజలు బస్సులు ఎక్కకుండా  ఆటోలు, సెవన్ సీటర్లు, కమాండర్ జీపులు వంటి  ప్రయివేటు వాహనాలు తిరిగే రూట్లలో మినీ బస్సులు తిప్పేలా ఎంపిక చేసుకున్నారు. 

ఈ మినీ బస్సుల్లో డ్రైవర్ ఒక్కరే టికెట్ మిషన్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చి వారి గమ్యస్థానాలకు చేరుస్తారు. జిల్లాల్లో 136 రూట్లతో పాటు హైదరాబాద్ నగరం నుంచి నేరుగా వరంగల్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి రూట్లలో సైతం ఈ మినీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో  బస్టాండ్ వరకు ప్రయాణికులు వచ్చి ఎక్కుకుండా, వారి కాలనీల నుంచే జిల్లాల్లో వారు దిగే ప్రాంతం వరకు నేరుగా ఈ మినీ బస్సులు నడిపేందుకు రెడీ అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: