తెలంగాణ పునర్నిర్మాణంలో మ‌రో అడుగు వేసారు గులాబీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో దాదాపు 39 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించేందుకు కీల‌క ఒప్పందం నేడు జ‌రిగింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్ర‌క ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబాయిలోని గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదుర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై  కేసీఆర్,  దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో మంగళవారం జరిగిన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సమావేశంలో ఈ చారిత్రక ఒప్పందం వేదిక‌య్యింది.
 
ఈ ఒప్పందంలో గోదావరి, ప్రాణహిత, పెన్ గంగలపై మూడు బ్యారేజిల నిర్మాణానికి ముఖ్యమంత్రులు పరస్పరం అంగీకారం తెలిపారు. అంతేకాకుండా మేడిగడ్డ‌, తుమ్మిడి హ‌ట్టి,  చ‌నాక‌- కొరాటా బ్యారేజీలపై కూడా ఒప్పందాలు కుదిరాయి. దీంతో తెలంగాణ‌కు గోదావ‌రిలో హ‌క్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని  స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం ల‌భించింది. ఇక ఒప్పందాల విష‌యానికి వ‌స్తే.....

ఒప్పందం - 1


గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజి ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది. వాస్త‌వానికి మేడి గ‌డ్డ బ్యారేజీ చరిత్ర‌లో లిఖించ‌ద‌గిన సాగునీటి నిర్మాణం. కండ్ల ముందే గోదావ‌రి జలాలు స‌ముద్రంలో క‌లుస్తున్నాయి. ఇందులో తెలంగాణ త‌న వాటా ను వాడుకొని కోటి ఎక‌రాల‌కు సాగు నీరందించే బృహ‌త్త‌ర ల‌క్ష్యానికి ఊత‌మిచ్చేది కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కం. దీనిల కీల‌క‌మైన మేడిగ‌డ్డ బ్యారేజీ నిర్మిస్తే త‌ప్ప‌... ఈ ప్రాజెక్టు ముందుకు సాగదు. 
ఒప్పందం - 2

ప్రాణహిత తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 1.8 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. మ‌హారాష్ట్ర  తో ఇబ్బంది లేకుండా రూ.4,231 కోట్ల అంచనా విలువ‌తో బ్యారేజీ నిర్మాణానికి సిద్ద‌మైంది. ఈ ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేయ‌డానికి వాడుకోనుంది. ప్రాణహిత చేవెళ్ల కింది జిల్లాలో గ‌తంలో ప్ర‌తిపాదించిన 56,500 ఎక‌రాల‌కు బ‌దులు మొత్తం 14.40 టీఎంసీల నీటిని వాడుకుంటూ 1.44 లక్ష‌ల ఎక‌రాల‌కు నీరందేలా డిజైన్ మార్చింది. ప్ర‌ధాన కాలువ‌పై 11, 54 కిలో మీట‌ర్ల వ‌ద్ద లిప్టులు ఏర్పాటు చేసి , మొత్తం  5 ద‌శ‌ల్లో 1.10 టీఎంసీల సామార్ధ్యంతో ఉండే రిజర్వాయ‌ర్లు నిర్మించ‌నున్నారు. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్ – కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

ఒప్పందం - 3

లోయ‌ర్ పెన్ గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా మ‌హారాష్ట్ర సర్కార్ తో చేసుకున్న ఈ మ‌హా ఒప్పందంతో  కౌటాల - 12,452, బెజ్జూర్ - 13,700, రెబ్బెన - 38,830, తాండూరు - 19,700, దహేగాం - 10,400, భీమిని - 21,500, నెన్నెల - 19,556, బెల్లంపల్లి - 7,870 ఎకరాల్లో సాగునీరు అందనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: