ప్ర‌కృతి నేర్పిన పాఠాలు నేర్చుకుని ముందుకు పోతే స‌మ‌స్య‌లు ఎదురుకావ‌ని నిరూపించాయి ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు. అన‌వ‌స‌ర‌పు హ‌డావిడికి పోతే ఏం జ‌రుగుతుందో ప్ర‌త్య‌క్షంగా చూసిన ప్ర‌భుత్వాలు ఇప్పుడు స‌రైన అడుగులు వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. తాజాగా కృష్ణా పుష్కరాలకు ఘ‌నంగా శుభం కార్డు వేసి కొత్త పాఠాలు నేర్చాయి తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు. 


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  ఈనెల 12న ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు ఘ‌నంగా ముగిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగిన పుష్కరాల్లో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి, నదీమతల్లికి నీరాజనాలు పలికారు. దీపారాదనలు చేసిన కృష్ణమ్మకు ప్రణమిల్లి నమస్కరించారు. లక్షలాది మంది భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.  రెండు ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేయడంతో యాత్రికులు ఎటువంటి అసౌకర్యం లేకుండా పుష్కర స్నానాలు చేయగలిగారు. పుష్కరాల ముగింపు కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాయి తెలుగు రాష్ట్రా ప్ర‌భుత్వాలు. 

గ‌త విషాదం నుంచి తేరుకుని..
గ‌త ఏడాది గోదావ‌రి పుష్క‌రాల సమ‌యంలో ఎదురైన విషాదాన్ని ఎవ‌రూ మ‌రిచిపోలేదు. గోదావరి మహా పుష్కరాల తొలిరోజే రాజమండ్రి పుష్క‌ర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో ముప్ఫై మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధ్యులెవరైనప్పటికీ ఇది మానవ వైఫల్యానికి చెల్లించాల్సి వచ్చిన మూల్యం. మన దేశంలో సామూహిక ఉత్సవాలెంత సుప్రసిద్ధమైనవో, సమూహ నిర్వహణ వైఫల్యాలూ అంతే ఘనమైనవి. కనుకనే ఒకదాని వెంట మరో విషాదాన్ని లెక్కపెట్టుకుంటూ కూచోవాల్సిన దుస్థితి, క్షమించ‌రాని వైఫల్యాల నుంచి సైతం ఏమీ నేర్చుకో లేని ఉదాసీనత మన సంస్కృతిలో భాగంగా మారాయి. అయితే ఈ ఏడాది కృష్ణ‌ పుష్కరాల నిర్వహణను ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపించింది. అందుకే ఆనందంగానే కృష్ణ పుష్క‌రాల‌కు శుభం కార్డు ప‌డింది. 


తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల వేడుకలు క‌న్నుల‌పండ‌వ‌గా ముగిసాయి. విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదికి సమర్పించే హారతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్‌ ప్రభు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణా హారతి కార్యక్రమానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ సహా రియో ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు, కోచ్‌ గోపీచంద్‌, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఘ‌నంగా ముగిసాయి. బీచుపల్లి ఘాట్‌లో తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కృష్ణమ్మకు ముగింపు హారతినిచ్చారు. ఈ హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి. తెలంగాణ‌లో 2 కోట్ల 51 ల‌క్ష‌ల మంది భ‌క్తులు పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.


పుష్కారాలు, మ‌హాజాత‌రాల‌ను, పండ‌గ‌ల‌ను ప్ర‌భుత్వాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హించాలి. ఇప్ప‌టికే జ‌రిగిన విషాద ఘ‌ట‌న‌ల నుంచి పాఠాలు నేర్చి ప్ర‌జ‌లంతా ఆనందంగా జ‌రుపుకునే ఏర్పాట్లు చేయాలి. అన‌వ‌స‌ర‌పు హ‌డావిడి త‌గ్గించి భ‌క్తుల‌కు స‌రైన ఏర్పాట్లు చేస్తే చాలు. అప్పుడే పండ‌గ‌లు ఆనందంగా జ‌రుపుకుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: