కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి. నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కుమారుడు. 2011లో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మృతి చెందాడు. ఇన్నాళ్లు అతడు ప్రమాదంలోనే మరణించాడని అందరు భావించారు. అయితే గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత వెలుగు చూస్తున్న వాస్తవాలతో.. అది ప్రమాదమా? లేక హత్యా?. పక్కా ప్లాన్ ప్రకారమే రోడ్డు ప్రమాదం రూపంలో నయీమే అతడ్ని చంపించాడా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఓ సెటిల్ మెంట్ లో భాగంగా భువనగరికి చెందిన వ్యాపారి నాగేంద్రకు నయీం వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి బయటకొచ్చింది. అందులో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రస్తావన రావడం అతడి మరణంపై ఇప్పుడు సందేహాలు రేకెత్తిస్తోంది.

Image result for komati reddy son prateek accident

వ్యాపారి నాగేంద్రను నయీం బెదిరించిన ఆడియోను పోలీసులు విడుదల చేశారు. కోటి రూపాయలు ఇవ్వకపోతే కోమటిరెడ్డి కొడుకును చంపినట్లు, నీ కుటుంబసభ్యులను చంపేస్తానంటూ నయీం బెదిరించాడు. ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నానని, డబ్బు రెడీ చేసేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలని మొదట వ్యాపారి అడగగా... నయీం తిరస్కరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇక నువ్వు డబ్బులిచ్చినా నేను తీసుకోను. తగిన శిక్ష అనుభవిస్తావని హెచ్చరించాడు. డబ్బులు సమకూర్చుకునేందుకు నెలరోజుల సమయం ఎందుకు? పోలీసులు నన్ను చంపేస్తే డబ్బులు మిగులు తాయని భావిస్తున్నావా? నేను చావను అని వ్యాపారికి నయీం వార్నింగ్ ఇచ్చాడు. కాళ్లు మొక్కుతా బాన్ చంద్ అని ప్రాధేయపడగా.. చివరకు సదరు వ్యాపారికి నెలరోజుల గడువు ఇచ్చాడు. ఆడియోలో.. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రస్తావన ఉండటంతో.. అతడి మరణంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 2011 డిసెంబరు 20న ప్రతీక్‌రెడ్డి తన స్నేహితులు ఆరవ్‌రెడ్డి, చంద్రారెడ్డి, సుజితకుమార్‌ తో కలిసి ఏపీ 24 ఏహెచ్ 9999 స్కోడా కారులో గండిపేట్‌ నుంచి పటానచెరు వైపు వెళుతున్నారు. కొల్లూరు ఔటర్‌రింగ్‌ సర్వసు రోడ్డు వద్ద గొర్రెల మంద అడ్డు రావడంతో తప్పించే ప్రయత్నంలో కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టింది. 30 అడుగుల ఎత్తుకు ఎగిరి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నడుతుతున్న చంద్రారెడ్డితో సహా ప్రతీక్‌రెడ్డి, సుజితలు అక్కడే మృతి చెందారు. ఆరవ్‌రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓవర్ స్పీడ్ వల్లే కారు అదుపు ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్ష్యులు, పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం 2012లో కేసును మూసివేశారు.

తాజా పరిణామాలతో..  ప్రతీక్ రెడ్డి మరణంపై సర్వత్రా సందేహం వ్యక్తమౌతోంది. రింగురోడ్డు పైకి గొర్రెల మంద ఎలా వచ్చింది? కారు వెనుకభాగం.. ఏదో వాహనం గుద్దినట్లు ఎలా నుజ్జునుజ్జు అయింది? అన్న అనుమానం కలుగుతుంది. పోలీసులు మాత్రం ఈ వాదనతో ఏకీ భవించడం లేదు. ప్రతీక్ రెడ్డి కారు ప్రమాదాన్ని నయీం తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. వ్యాపారి నాగేంద్రపై ఒత్తిడి పెంచేందుకే కోమటిరెడ్డి కుమారుడి పేరును ప్రస్తావించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై కోమటిరెడ్డి కుటుంబ  సభ్యులెవరూ ఇంత వరకు స్పందించలేదు. నయీం కేసుల తదుపరి దర్యాప్తులో భాగంగా.. ప్రతీక్ రెడ్డి కేసును పోలీసులు రీ ఓపేన్ చేస్తారో, లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: