తెలంగాణ సర్కార్ దాదాపుగా నాలుగు ద‌శాబ్దాల చరిత్రకు తెర‌దించిందా?  తెలంగాణకు సాగునీరు తీసుకువ‌చ్చేక్ర‌మంలో... మేము సాధించామ‌ని చెప్పుకునేందుకు యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చేతులో తాక‌ట్టు పెట్టిందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర్గాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌తో కొన్ని అనుమానాలు క‌ల‌గ‌క మాన‌వు. అయితే... మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య కుదిరిన ఒప్పందం ఒక చారిత్రాత్మ‌కముంటూ, ఇరు రాష్ట్రాల‌ల చ‌రిత్రలో ఇది సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన రోజ‌ని, రాష్రాల  మ‌ధ్య జ‌ల‌యుద్దాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో రెండు రాష్ట్రాలు సుహృద్బావ వాతావ‌ర‌ణంలో సాగునీటి మీద ఒప్పందాలు చేసుకోవ‌డం దేశంలో కొత్త ఒర‌వ‌డికి నాంది అంటూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌చారం చేస్తూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి చ‌రిత్రాత్మ‌క తాక‌ట్టేన‌ని నొక్కి నొక్కి ఒక్కానిస్తున్నాయి. అయితే ఇందులో నిజమేంతో తెలియాలంటే ఒక్క‌సారి మ‌నం ఇరువురి వాద‌న‌లు గ‌మ‌నిద్దాం....

తెలంగాణ సర్కార్ చెబుతున్న వాద‌న ప్ర‌కారం.... 

తెలంగాణ సీఎం తో పాటు ఆ పార్టీ నేత‌లు సంబురాలు చేసుకుంటున్నాయి. 40 ఏళ్లు గా ఏ ప్ర‌భుత్వం చేయ‌ని ప‌ని  గులాబీ నేత సీఎం కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావు చేశార‌ని విప‌రీత ప్ర‌చారానికి దిగాయి. వాస్త‌వానికి... నాలుగు ద‌శాబ్ధాలు గా మూరెడు కూడా క‌ద‌ల‌ని మూడు భారీ ప్రాజెక్టుల‌న శ‌ర‌వేగంగా అవ‌ర‌స‌మైన సాంకేతిక ఒప్పందానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ఆమోద ముద్ర లభించింది! చ‌ర్చ‌లు, సంప్ర‌దింపు మార్గంలో రెండేళ్లుగా చేసిన కృషి, క‌న‌బ‌ర్చి లక్ష‌శుద్ది  తో చ‌నాక‌-కోరాట( పెనుగంగ న‌ది) త‌మ్మిడి హ‌ట్టి(ప్రాణ‌హిత న‌ది) , మేడిగగ్గ‌(గోదావ‌రి న‌ది) బ్యారేజీ ల ఒప్పందాల‌పై వివాదం లేకుండా ముంద‌డుగు వేయించింది! ఇక‌పోతే గత చ‌రిత్ర‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే... 1975 అక్టోబ‌ర్ 6 న మ‌హారాష్ట్ర‌, అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య లెండీ, లోయర్ పెనుగంగ‌, ప్రాణ‌హిత ప్రాజెక్టుల‌పై లాంఛ‌నప్రాయ ఒప్పందాలు జ‌రిగాయ‌ని గోదావ‌రి జ‌లాల వివాదాల ట్రిబ్యున‌ల్(డీడీబ్ల్యూడీటీ) నివేదిక పేర్కొంటుంది.

రాష్ట్రంలో 39 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు...
 
ఈ ఒప్పందాల‌ను అప్ప‌టి పాల‌కులు చిత్త‌శుద్దితో తీసుకొని ఉంటే... అనంత‌రం అమ‌లుపై దృష్టి సారించి ఉంటే.... తెలంగాణ‌కు ఇన్నేళ్లు సాగు నీటి గోస ఉండేది కాదు.  అయితే తాజాగా కేసీఆర్ చేసుకున్న ఒప్పందాల‌తో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 39 లక్షల ఎక‌రాలకు సాగునీరు అందించేందుకు కీల‌క ఒప్పందం నేడు జ‌రిగింది. దీంతో తెలంగాణ కు గోదావ‌రిలో హ‌క్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం ల‌భించింది. గోదావ‌రి న‌ది పై 100 మీట‌ర్ల ఎత్తులో , 16 టీఎంసీల నీటి నిల్వ సామ‌ర్ద్యం తో మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం కుదిరింది. దీంతో క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, మెద‌క్ , నిజామాబాద్, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాలో 18.19 లక్ష‌ల ఎక‌రాలు కొత్త‌గా సాగులోకి వ‌స్తాయి. శ్రీరాంసాగ‌ర్ , నిజాం సాగ‌ర్. సింగూర్ జ‌ల‌శ‌యాల‌కు కింద మ‌రో 18 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ  చెందుతుంది. ఇక మ‌రో ప్రాజెక్ట‌యిన ప్రాణహిత త‌మ్మిడి హ‌ట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల ఎత్తులో 1.8 టీఎంసీల నీటి నిల్వ సామ‌ర్ధ్యం తో బ్యారేజీ నిర్మాణం జ‌రుగుతుంది. 

ప్ర‌ధాన కాలువ‌ల‌పై లిప్టుల ఏర్పాట్లు....

మ‌హారాష్ట్ర‌తో ఇబ్బంది లేకుండా రూ. 4.231 కోట్ల అంచ‌నా విలువ‌తో బ్యారేజీ నిర్మాణానికి సిద్ద‌మైంది. ఈ ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాను స‌స్య‌శ్యామలం చేయ‌డానికి వాడుకోనుంది. ప్రాణ‌హిత చేవెళ్ల కింద జిల్లాలోల గ‌తంలో ప్ర‌తిపాదించిన 56,500 ఎక‌రాల‌కు బ‌దులు మొత్తం 14.40 టీఎంసీల నీటిని వాడుకుంటూ 1.44 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరు అందేలా డిజైన్ మార్చింది. ప్ర‌ధాన కాలువ‌పై 11.54 కిలోమీట‌ర్ల వ‌ద్ద లిప్టులు ఏర్పాటు చేసి... మొత్తం 5 ద‌శ‌ల్లో 1.10 టీఎంసీల సామార్ధ్యంతో ఉండే రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించ‌నున్నారు. దీని వ‌ల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, సిర్పూర్-కాగ‌జ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అంద‌నుంది. అంతేకాకుండా...కౌటాల‌-12,452, బెజ్జూర్- 13,700, రెబ్బెన‌-38,830 , తాండూరు-19,700, ద‌హేగాం- 10,400 , భీమిని-21,500 , నెన్నెల‌- 19,556, బెల్లంప‌ల్లి-7,870 ఎక‌రాల్లో సాగునీరు అందుతాయి.  ఇదీలా ఉంటే ప్ర‌దాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ వాద‌న దీనికి భిన్నంగా ఉంది....

ఒప్పందం పై కాంగ్రెస్ తీవ్ర నిర‌స‌న‌లు....

మ‌హారాష్ట్ర తో తెలంగాణ ప్ర‌భుత్వం చేసుకున్న చారిత్ర‌క ఒప్పందం కాద‌ని... తెలంగాణ భావిత‌రాల‌కు శాశ్వ‌త‌, మ‌హాద్రోహ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. ప్రాజెక్టు ఎత్తు త‌గ్గించుకుంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ముంబాయి లో ఒప్పందం చేసుకుంటున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ నిర‌స‌న‌ల‌ను చేప‌ట్టింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, భావిత‌రాల‌కు శాశ్వ‌త ద్రోహం చేసే విధంగా 148 మీట‌ర్ల ఎత్తుకే కేసీఆర్ ఒప్పందం చేసుకున్నార‌ని విమ‌ర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం 152 మీట‌ర్ల ఎత్తుకోసం ఒప్పందం చేసుకోవాల‌నుకుంటే... ఇప్పుడు దానికి త‌గ్గించి ఎందుకు ఒప్పందం చేసుకున్నార‌ని ప్ర‌శ్నించారు.  గోదావ‌రి న‌దీ జ‌లాల కోసం గ‌తంలోన‌నే ఒప్పందాలు జ‌రిగాయ‌న్నారు. 1975 నుంచి 2012 వ‌రకు జ‌రిగిన ఒప్పందాల‌పై కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ ప్ర‌భుత్వం కొనసాగింపుగా ఒప్పందాలు చేసుకుంద‌న్నారు.

మ‌హారాష్ట్ర‌తో కుమ్మ‌కైన కేసీఆర్:  జానారెడ్డి

తుమ్మిడి హ‌ట్టి వ‌ద్ద 152 మీ ఎత్తుతో ప్రాణ‌హిత ప్రాజెక్టు ను రూ. 38 వేల కోట్ల‌తో నిర్మించి తెలంగాణ జిల్లాల‌కు గ్రావిటీ ద్వారా నీరందించాల‌ని నిర్ణ‌యిస్తే కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం ...148 మీ ఎత్తుకు ప‌రిమితం చేసి ప్రాజెక్టు వ్య‌యాన్ని రూ. 83 వేల కోట్ల‌కు పెంచింద‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జానారెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట‌ర్ల‌ తో కుమ్మ‌క్కైన కేసీఆర్ మ‌హారాష్ట్ర లో 3 వేల ఎక‌రాల ముంపున‌కు ఒప్పించ‌కుండా ప్రాజెక్టు వ్య‌యాన్ని పెంచి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేశార‌న్నారు. క‌మీష‌న్ల క‌క్కుర్తి తోనే రీడిజైనం టూ అంచ‌నా వ్య‌యాన్ని పెంచేసి ప్ర‌భుత్వం వేల కోట్ల అవినీతి కి పాల్ప‌డుతోంద‌న్నారు. అయితే ఇక్కడ మ‌హారాష్ట్ర లాభ న‌ష్టాల విష‌యం పక్క‌న‌పెడితే... ఎత్తు త‌గ్గించ‌డం వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జ‌రిగే న‌ష్ట‌మేమి లేద‌ని టీ. స‌ర్కార్ వాద‌న. వాస్త‌వాన్ని గ‌మ‌నిస్తే గ‌త కాంగ్రెస్ హాయాంలోనే ఈ ఒప్పందాల పై తీవ్ర మైన చ‌ర్చ జ‌రిగింది. అప్ప‌ట్లోనే కాంగ్రెస్ సైతం ఎత్తు త‌గ్గించేందుకు ముందుకు రాలేదు. దీంతో మ‌హారాష్ట్ర స‌ర్కార్ ఈ ఇష్యూ పై దాట‌వేత దోర‌ణిని వ్య‌వ‌హారించింది. మ‌రీ ఎవ‌రి వాద‌నలో న్యాయం ఎంత‌ ఉందో తెలియాలంటే మ‌రికొన్ని రోజుల వేచి చూడాల్సిందే...!


మరింత సమాచారం తెలుసుకోండి: