న్యూయార్క్: ఫ్యాషన్ షో అనగానే మెరుపుతీగలాంటి అమ్మాయిలు వయ్యారంగా నడుచుకుంటూ అందాలు ఒలకబోసే దృశ్యం గుర్తుకు వస్తుంది. సన్నని నడుము, అందమైన మోముతో పొడుగు కాళ్ల సుందరాంగులు వేసే ఒక్కో అడుగుకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఫ్యాషన్ అంటేనే అందాల ముద్దుగుమ్మల సందడి. అలాంటి షోలో 19 ఏళ్ల ముంబై యువతి పాల్గొనబోతోంది. ఇందులో విచిత్రం ఏముందనుకుంటున్నారా? ఉంది.. ఆ యువతి ఓ యాసిడ్ బాధితురాలు. పేరు రేష్మా ఖురేషీ.

Image result for reshma qureshi

2014లో రేష్మా తన బావ చేతిలో యాసిడ్ దాడికి గురైంది. యాసిడ్ ఆమె ముఖాన్ని ఛిద్రం చేసింది. ఓ కన్ను కోల్పోయింది. అందమైన ఆమె మోము అందవికారంగా మారిపోయింది. ఈ ఘటనతో ఖురేషీ ఏమాత్రం కుంగిపోలేదు. జీవితంపై దిగులు చెందలేదు. భవిష్యత్తుపై భరోసాను వదులుకోలేదు. మళ్లీ మామూలు జీవితాన్ని గడపాలనుకుని నిశ్చయించుకుంది. భారత్‌లో యాసిడ్ బహిరంగ అమ్మకాలపై గళమెత్తింది. యూట్యూబ్‌లో వీడియోల్లో కనిపిస్తూ బ్యూటీ టిప్స్‌, మేకప్‌పై సలహాలు, సూచనలు ఇవ్వడం ప్రారంభించింది. 

Image result for reshma qureshi

రేష్మా ప్రతిభను, ధైర్యాన్ని గుర్తించిన ఎఫ్‌టీఎల్ మోడా అనే ఫ్యాషన్ ప్రొడక్షన్ కంపెనీ.. వచ్చే నెలలో న్యూయార్క్‌లో నిర్వహించనున్న ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. ఏడాదికి రెండుసార్లు జరిగే ఈ ఫ్యాషన్ వీక్ ప్రపంచంలోని ప్రముఖ మోడళ్లు, ఫ్యాషన్ ఎడిటర్లు, బయ్యర్లు, డిజైనర్లను ఏకం చేస్తుంది. సెప్టెంబరు 8న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో రేష్మా క్యాట్‌వాక్ చేయనున్నట్టు ఎఫ్‌టీఎల్ మోడా తెలిపింది. వచ్చేవారం రేష్మా న్యూయార్క్ విమానం ఎక్కనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: