కొత్తదనాన్ని కోరుకోవడంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారు. ఇన్నాళ్లూ ఇంటర్నెట్ కోసం 2G, 3G నెట్ వర్క్ లపై ఆధారపడి బఫరింగ్ సమస్యతో సతమతమయ్యారు. మార్కెట్లో 4G శకం ప్రారంభం కావడంతో అటు వైపు అడుగులు వేస్తున్నారు. అయితే.. ఆ సేవలు మితిమీరిన ఖరీదు కావడంతో కాస్తంత నిరాశకు గురయ్యారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రిలయన్స్ సంస్థ 4G మార్కెట్లోకి వచ్చింది. మొబైల్ సేవల రంగంలో మరోసారి విప్లవం తేవడం తమతోనే సాధ్యమని రుజువు చేసింది. 


సెల్ ఫోన్ మేనియా ప్రారంభమౌతున్న రోజుల్లో 501 రూపాయలకే ఫోన్ అందించి విప్లవాత్మకమైన మార్పులకు మూలమైన రిలయన్స్ సంస్థ.. ఇప్పుడు 4G సేవల రంగంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తోంది. 4జీ మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపి మార్కెట్లో అగ్రగామిగా నిలిచేందుకు Reliance Jioను మరింత అగ్రెసివ్‌గా జనంలోకి తీసుకెళుతోంది. వీలైనంత త్వరగా 10 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది కంపెనీ లక్ష్యంగా తెలుస్తోంది. ప్రివ్యూ ఆఫర్ కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా అందిస్తోంది. 
'జియో' సత్తా ఏంటో ఇప్పటికే జనానికి రిలయన్స్ సంస్థ రుచిచూపించింది. 


'జియో' ప్రివ్యూ ప్రమోషన్ లో భాగంగా 4Gసిమ్ తీసుకున్న వారికి మొదటి మూడు నెలల పాటు ఉచిత అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను అందిస్తోంది. తొలుత రిలయన్స్ ఉద్యోగులకు, LYF స్మార్ట్ ఫోన్ లు కొన్న వారికి 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను ప్రకటించింది. తరువాత కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను విస్తరించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి కస్టమర్ ప్రివ్యూ ఆఫర్‌కు అర్హులు చేస్తూ..


అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో జియో సిమ్ ల కోసం షోరూంల ఎదుట క్యూ కడుతున్నారు. మార్కెట్లో జియో సిమ్ లకు డిమాండ్ పెరగడంతో.. వాటి కొరత ఏర్పడింది.  డిమాండ్ కు సరిపడా సిమ్ లు అందుబాటులో లేకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ గాళ్లు రెడీ అయిపోయారు.  కొనుగోలు దారుడి ఉత్సాహాన్ని బట్టి 'జియో' సిమ్ లను రూ.1500 నుండి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. 


వినియోగదారుల్లోనే కాదు.. టెలికామ్ రంగంలోనూ రిలయన్స్ జియో చిచ్చు రేపింది. బీటా వర్షన్ పేరుతో 4జీ సేవ‌ల‌ను ఉచితంగా ఇవ్వ‌డం త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలాంటి ఇత‌ర సంస్థలు వాదిస్తున్నాయి. ప్రి లాంచ్ మోడ్‌లో ఉన్నామంటూ రిల‌యెన్స్ ఉచితంగా 4జీ ఎయిర్‌వేవ్స్‌ను వాడుకోవ‌డం వ‌ల్ల ప్రధాన నెట్ వర్క్ ఆపరేటర్లతో పాటు ప్ర‌భుత్వం కూడా తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోతుందని ఇప్పటికే సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ప్ర‌ధాని కార్యాల‌యానికి ఫిర్యాదు చేసింది. బీటా టెస్టింగ్ పేరుతో విలువైన వాణిజ్య సేవ‌ల‌ను ఉచితంగా ఇవ్వ‌డం సరికాద‌ని అసోసియేష‌న్ వాదిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: